Kadiyam Kavya: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్(BRS) పార్టీకి బాకీ అనే పదం ఎత్తే అర్హత లేదని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) విమర్శించారు. హనుమకొండలోని డిసిసి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని మండిపడ్డారు.
Also Read: Huma Qureshi: కుక్కలు చింపిన విస్తరిలా ఉంది.. ఈ టీషర్ట్ రూ.65 వేలట.. నటిని ఏకిపారేస్తున్న నెటిజన్లు!
బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పు
బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసింది మీరు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకుండా బీజేపి కొమ్ము కాసిందని విమర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసిందన్నారు. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమించకుండా విద్యార్థులకు అన్యాయం చేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, ఇంటికో ఉద్యోగం ఇలా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. రైతుబంధు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. 40 లక్షల మంది పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా బాకీ పడ్డది భారత రాష్ట్ర సమితి కాదా అని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం
గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలను సరి చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ, సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో పాటు యువతకు 59 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఈ స్థాయిలో ప్రజా సంక్షేమానికి కృషి చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేస్తుంది బాకీ కార్డ్ కాదు అది డోకా కార్డు అని విమర్శించారు. ఈ డోకా కార్డు ద్వారా ప్రజలకు ఆధారాలతో సహా నిజాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు రానున్న రోజుల్లో అండగా నిలవాలని ఎంపీ డా. కడియం కావ్య కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
Also Raed: Warangal District: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరువు.. ఎందుకో తెలుసా!
