Uttam Kumar Reddy: మాజీ సీఎం కేసీఆర్ ఓ చానెల్ ఇంటర్వ్యూలో మూడున్నర గంటలపాటు మాట్లాడిన విషయాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బుధవారం హోటల్ సెంట్రల్ కోర్టులో మీడియా ముందు ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి మరీ లెక్కలు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ పదే పదే అబ్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని లెక్కలు వివరిస్తూ మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహించారు. అందులో నిజానిజాలుగా తేల్చిచెప్పవలసిన బాధ్యత మంత్రులుగా తమపై ఉన్నదని వివరించారు.
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 7 వేల మెగావాట్ల నుంచి 12 వేల మెగావాట్లకు పెంచినట్టు చెప్పిన కేసీఆర్ మాటలు అవాస్తవం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. పదేళ్లలో వాళ్లు భద్రాద్రి పవర్ ప్లాంట్ మాత్రమే పూర్తి చేశారని, అది కూడా అవుట్ డేటెడ్ అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలోనే నాశమైన కాళేశ్వరంను రిపేర్ చేస్తానని కేసీఆర్ అన్నాడని గుర్తు చేశారు. కాళేశ్వరం మీద రూ. 95 వేల కోట్లు ఖర్చు చేశారని, పూర్తి చేయాలంటే 1.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. మేడిగడ్డ 2023 అక్టోబర్ 21న కుంగితే.. డిసెంబర్ 7వ తేదీన తాము అధికారంలోకి వచ్చామని తెలిపారు. మేడిగడ్డ కుంగిన 45 రోజుల వరకూ కేసీఆర్ నోరు మెదపలేదని అన్నారు. ఆ ప్రాజెక్టు కుంగిన తర్వాత నీళ్లు వదిలింది వాళ్లేనని, కానీ, నెపం మాత్రం తమపై నెడుతున్నారని వివరించారు.
Also Read: కేసీఆర్ దమ్ముంటే కాళేశ్వరం వద్ద చర్చకు రా..!
బీఆర్ఎస్ పార్టీ 104 ఎమ్మెల్యేల బలం నుంచి 39కి పడిపోయిందని కేసీఆర్ అన్నారు. ఆ 39 మందిలోనూ 25 మంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని వివరించారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. కేసీఆర్ హయాంలో 7031 వరి కొనుగోలు కేంద్రాలను పెడితే.. తాము 7200 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. అంతేకాదు, గతేడాది కంటే 15 రోజులు ముందుగానే కొనుగోలు సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
కృష్ణా నదీ జలాల విషయంలోనూ కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో కృష్ణాలో 811 టీఎంసీల నీరు ఉంటే రాష్ట్ర విభజన తర్వాత 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకుని తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆగ్రహించారు. ఈ అంగీకారం వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాకు నష్ట వాటిల్లిందని వివరించారు. కేసీఆర్, జగన్ కలిసిన ప్రతిసారీ తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలిపారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీకి కేటాయించిన నీళ్ల కంటే ఎక్కువ ఇచ్చారని, కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కువ దోపిడీ జరిగిందని వివరించారు. వారిద్దరి స్నేహం వల్లే ఇది జరిగిందని ఆరోపించారు.