Congress Party: రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో బుధవారం కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు. అలాగే.. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరితో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో బొగ్గు గనులను వేలం వేయాలని ఇది వరకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డెడ్ లైన్ విధించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గత పదేళ్లుగా గనులు వేలం వేయలేదని, ఈ సారి కచ్చితంగా గనులు వేలం వేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బొగ్గు గనుల వేలం నిర్వహణ అంశంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలపై వీరిద్దరూ చర్చించినట్టు తెలిసింది. లోక్ సభ ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వీరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించడం స్వాగతించదగినదని చెబుతున్నారు.
అలాగే, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరితోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. దేశంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు.