– పదేళ్లలో రైతుల కోసం బీజేపీ ఏం చేసింది?
– మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిందా?
– ఐదేళ్లలో కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశారు?
– ప్రత్యేకంగా తెచ్చిన నిధులేవి?
– దమ్ముంటే వీటిపై చర్చకు రావాలి
– బండికి పొన్నం ప్రభాకర్ సవాల్
Minister Ponnam Prabhakar Aggressive On BJP Leaders : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేతల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ముఖ్యంగా కరీంనగర్ యుద్ధంలో బండి సంజయ్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ అందివచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటోంది. ఇన్నేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలంటూ హస్తం నేతలు నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, 10 ఏళ్ల బీజేపీ పాలనలో రైతులకు ఏం చేశారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు.
2019 మేనిఫెస్టోలో 13వ పేజీ తీసి ఒకసారి చదువుకోవాలని హితవు పలికారు. రైతులకు పింఛన్లు ఇస్తామన్నారని ఇప్పటిదాకా ఇవ్వలేదంటూ సెటైర్లు వేశారు. మేనిఫెస్టోలోని 42వ పేజీలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు చేశారా? అని అడిగారు. దమ్ముంటే కరీంనగర్ చౌరస్తాలో మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అంటూ బండికి సవాల్ చేశారు. మీ పదేళ్ల కర్కశ పాలనపై మా వంద రోజుల ప్రజా పాలన ఎలా ఉందో ప్రజలే అభిప్రాయం చెబుతారని అన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగ బీజేపీ 700 మంది అన్నదాతలను పొట్టన పెట్టుకున్న ఆరోపించారు పొన్నం. ఉత్తరప్రదేశ్, హర్యానాలో బీజేపీ అభ్యర్థుల మీద రైతులు తిరగబడుతున్నారని, ఎక్కడికక్కడ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారన్నారు. కరీంనగర్ వేదికగా దీక్ష చేస్తే మీ బండారం బయటపడుతుందనే భయపడుతున్నట్టు ఉందని ఎద్దేవ చేశారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామంటున్న బండి సంజయ్, అంత మందికి రేషన్ కార్డ్స్ ఇచ్చిందే తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనే విషయం గుర్తుంచుకోవాలని చురకలంటించారు.
ఈ పదేళ్ల ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అంటూ నిలదీశారు. అక్క చెల్లెళ్ళకు అన్నం పెట్టి లెక్కలు రాసుకునే మనస్తత్వమున్న బీజేపీ నేతలతో దేశం ప్రమాదంలో పడిందని అన్నారు. తమకు కరీంనగర్ అభ్యర్థి ఎవరు అన్నది ముఖ్యం కాదు, హస్తం గుర్తు ముఖ్యమని తెలిపారు. రైతులకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నామన్న ఆయన, దళారులకు తావు లేకుండా, రైతులకు నష్టం జరగకుండా తమ ముఖ్యమంత్రి స్వయంగా పంట కొనుగోలును పరిశీలిస్తున్నారని వివరించారు. బండి సంజయ్ ఐదేళ్లు ఎంపీగా ఉండి కరీంనగర్‌కు ఏమీ చేయలేదని విమర్శించారు మంత్రి. ప్రత్యేకంగా తెచ్చిన నిధులేంటని అడిగారు.