Jupally Krishna Rao: మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను ఛాలెంజ్ విసురుతున్న మీ బాగోతం వాటాలపై చర్చకు సిద్దమా? అని సవాల్ చేశారు. గత ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు నాపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రభారతీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మైక్రో బ్రువరీకి సంబంధించి 28 ఆగస్టు 2015లో జీవో నంబర్ 151 జారీ చేస్తూ మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు రూల్స్ ఫ్రేం చేశారన్నారు. జీవో ప్రకారం 1 జూలై 2016 న ప్రభుత్వం మెమో నంబర్ 24367 ఇస్తూ మొత్తం 20 బ్రూవరీలకు అనుమతిని ఇచ్చారని, 50 దరఖాస్తులు వస్తే 20 కి మాత్రమే అనుమతులు ఇచ్చారని వాటికి ఎలాంటి లాటరీ పద్దతిని పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఈ రెండేళ్లలో బ్రూవరీలకు సంబంధించి కొత్త చట్టం తేలేదన్నారు.
మీ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయి కదా?
మీ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయి కదా? అని నిలదీశారు. మెక్రో బ్రూవరీలకు సంబంధించి ఇప్పటి వరకు అనుమతుల కోసం నా వద్దకు ఎలాంటి ఫైళ్లు రాలేదని, సంబంధిత శాఖకు దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. కొత్త బ్రూవరీలకు దరఖాస్తులు వస్తే- ఆయా సంస్థలకు ఉన్న భూ లభ్యత, మౌలిక వసతులపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే అప్పుడు వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇది ఇలా ఉంటే అవగాహన రాహిత్యంతో మాపై హరీష్ రావు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మీరు 105 ఎలైట్ బార్లకు అనుమతి ఇచ్చారన్నారు. 2016 – 2023 వరకు ఏ ప్రతిపాదికన అనుమతులు ఇచ్చారు? లాటరీ ద్వారా కాకుండా మీకు నచ్చిన వారికి అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా? తప్పులన్ని మీరు చేసి మాపై బురదజల్లుతున్నారా? అని నిలదీశారు.
మీ ప్రభుత్వ హయాంలో 3,500 కోట్ల బకాయిలు
ప్రతి 15 రోజులకు బకాయిలు చెల్లిస్తే మీ ప్రభుత్వ హయాంలో 3,500 కోట్లు ఎక్సైజ్ శాఖలో ఎలా బకాయిలు పడ్డాయని ప్రశ్నించారు. మీరు చేసిన నిర్వాహకమే కదా ఈ బకాయిలకు కారణం? మీరు ప్రతీ 15 రోజులకు ఒకసారి బకాయిలు చెల్లిస్తే ఇన్ని వేల కోట్ల బకాయిలు ఎలా ఉన్నాయి? అంతే కాదు ఇతర పనులకు సంబంధించిన 40 వేల కోట్లు బిల్లులు పెండింగ్ లో పెట్టారని ప్రశ్నించారు. దొంగె దొంగ అన్నట్లు అరిచినట్లు ఉందని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది ఎవరు అని నిలదీశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్ ఆదాయం రూ. 10, 012 కోట్లు మాత్రమే ఉండేదని, 2014 -2023 వరకు తొమ్మిది ఏండ్లలో ఎక్సైజ్ ఆదాయాన్ని 34,869 కోట్లకు పెంచారని, అంటే రూ. 25 వేల కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ ద్వారా పెంచుకున్నారని తెలిపారు.
రూ.250కోట్ల ఆదాయం తగ్గినట్లే కదా?
మా ప్రభుత్వ హాయంలో 2024-25 సంవత్సరానికి ఎక్సైజ్ ఆదాయం రూ.34,603 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. అంటే మీ ప్రభుత్వంలో కంటే మా ప్రభుత్వంలో సుమారు రూ.250కోట్ల ఆదాయం తగ్గినట్లే కదా? ఇప్పుడు చెప్పండి తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది ఎవరు? అని నిలదీశారు. సింగూర్ జలాలను బీర్ల కంపెనీలకు తరలిస్తున్నారు అని విమర్శలు చేశారు. క్రాప్ హాలిడే ప్రకటించారు అని ఆరోపణలు చేశారు. మేము కొత్తగా బీర్ల కంపెనీలకు అక్కడ అనుమతి ఇవ్వలేదు. కొత్తగాపైప్ లైన్ వేయలేదు. అవన్ని గత ప్రభుత్వంలో ఉన్నవేనన్నారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వంలో నేను కూడా మంత్రిగా ఉన్నానని, ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చాను. మీ దోపిడీ, దౌర్జన్యాలను చూసి సహించలేక మీ పార్టీ నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు.
వాటాలు పంపిణీ చేసుకుంది మీరు కాదా?
వాటాలు పంపిణీ చేసుకుంది మీరు కాదా? కాసులకు కోసం కక్కుర్తి పడింది మీరు నీకంత నాకు ఇంత అన్నట్లు వ్యవహరించింది మీరు కాదా? అని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు సమీస్తుండటంతో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల లబ్ది కోసం మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నిజాయితీగా పని చేస్తుంటే ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో మీరు ఎలా ఉండే మీ ఆస్తులు ఎంటి ఇప్పుడు మీ ఆస్తులు ఏంటనే దానిపై చాలా విమర్శలు వచ్చాయన్నారు. నేను చెప్పిందని అబద్ధం అయితే నేను దేనికైనా సిద్ధం అని సవాల్ చేశారు. వ్యక్తిత్వ హననం చేయడం తగదు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి . ఇంత దుర్మార్గంగా మాట్లాడటం బాధకరం అన్నారు.
Also Read: Jupally Krishna Rao: కేసీఆర్ కుటుంబ రాజకీయాలే ఆ పార్టీ పతనానికి కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు

