Harish Rao: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం, శంకరంపేట మండలంలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్ (Brs) లోకి భారీగా చేరికలు జరిగాయి. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. శంకరంపేట(ఏ) మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత అలుగుల సత్యనారాయణ నేతృత్వంలో సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి హరీశ్ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో మెదక్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు భవాని నరసింహ చారి, ఉప సర్పంచ్ ఉప్పులూరి దశరథ్, గొట్టిముక్కల మాజీ సర్పంచ్ ఉష సూర్య ప్రకాష్, మాదిగ దండోరా అధ్యక్షులు సంగమేశ్వర్ వంటి ముఖ్య నాయకులు ఉన్నారు.
Also Read: Harish Rao: పాఠశాలలో పిల్లలకు అన్నం పెట్టలేని సీఎం ఈ రాష్ట్రానికి ఉండి ఏం లాభం? హరీష్ రావు ఆగ్రహం!
రెండేళ్లయినా హామీ లేవీ?
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా, ఎన్నికల ముందు గ్యారెంటీ కార్డులు పంచి, బాండ్ పేపర్ రాసిచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2,000 చేశారని, ఇంటింటికి మంచినీళ్లు అందించారని, రూ.10 వేల రైతుబంధు ఇచ్చారని, కేసీఆర్ కిట్ పెట్టి కాన్పుకు రూ.13 వేలు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే, పిల్లల చదువుల కోసం వెయ్యి గురుకుల పాఠశాలలు, నారాయణఖేడ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు పెట్టింది కేసీఆరేనని, ఆయన చెప్పినవి చేసిండు, చెప్పనివి కూడా చేసిండని అన్నారు. కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం అంతకంటే లేదని, అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను ఆగమాగం చేశారని ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ, పోలీస్ పహారాలో పాలన చేస్తున్నారని హరీశ్ విమర్శించారు.
Also Read: Harish Rao: రాష్ట్రంలో అతి పెద్ద పవర్ కుంభకోణానికి రూపకల్పన: హరీష్ రావు
