- యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన భట్టి విక్రమార్క
- యాంటీ డ్రగ్ అవేర్నెస్ సాంగ్ ఆవిష్కరణ
- మాదక ద్రవ్య రహిత తెలంగాణ సమాజమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం
- మాదక ద్రవ్య నివారణకు ఎన్ని నిధులైనా కేటాయిస్తాం
- తెలంగాణ పోలీసు వ్యవస్థ శక్తివంతమైనది
- విద్యార్థులు తాత్కాలిక వ్యసనాలకు అలవాటుపడొద్దు
- అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు
- భట్టి విక్రమార్క వెల్లడి
Mallu Bhatti vikramarka advice to youth not to addict madaka dravya:
మాదక ద్రవ్య రహిత తెలంగాణ సమాజమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాల రవాణాలో ఎంతటి పెద్దవారు ఉన్న ఉపేక్షించం, ఉక్కు పాదంతో అణచివేస్తామని స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ డే నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే యాంటీ డ్రగ్ అవేర్నెస్ సాంగ్ ను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు కనబడడానికి వీలులేదని కఠిన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో అక్రమ రవాణా, మాదక ద్రవ్య నివారణకు ఎన్ని నిధులైనా కేటాయిస్తాం బడ్జెట్ సమస్యనే కాదన్నారు. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే యువతను నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలను సమూలంగా నివారించడం మనందరి బాధ్యత తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలమైనది తెలివైనది ఎంత దూరం వెళ్లి నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు కలదని కొనియాడారు. సంఘవిద్రోహ శక్తులు, అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించడానికి కొందరు దుర్మార్గులు అలవాటు చేసే డ్రగ్స్ ఉచ్చులో పడి యువత బంగారు భవిష్యత్తును కోల్పోవద్దన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులు ఎదగాలని, ఈ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందన్నారు. తాత్కాలిక వ్యసనాలకు మీరు నష్టపోతే మీ తల్లిదండ్రులతో పాటు ఈ సమాజం బాధపడుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. ప్రశాంతంగా ఆప్యాయంగా ప్రేమగా ఉన్న కుటుంబ వ్యవస్థలో మాదక ద్రవ్యం విషప్రయోగం లాంటిదన్నారు. దేశానికి బలీయమైన మానవ వనరులను నిర్వీర్యం చేయాలని దేశ ద్రోహులు చేసే కుట్రలో అంతర్భాగమే మాదక ద్రవ్యాల రవాణా అని వెల్లడించారు. అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు వేసి పోలీసులు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుంటే కట్టడి చేయడం పెద్ద సమస్య ఏమీ కాదని వెల్లడించారు.