PM Narendra Modi: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇండియా బ్లాక్ నాయకులతో నిన్న సంప్రదింపులు జరిపిన తర్వాత పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇండియా బ్లాక్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి మెరుగైన ఫలితాలను రాబట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కూడా చాలా మెరుగైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే కూడా పార్టీలో చేరడంతో ఇప్పుడు కాంగ్రెస్ బలం 100కు చేరింది. బీజేపీ సీట్లు 303 నుంచి 242కు పడిపోయింది. బొటాబొటి మెజార్టీతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది.
ఇదిలా ఉండగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిన్న ప్రతిపాదన తెచ్చింది. దీనిపై నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటానని రాహుల్ గాంధీ వాయిదా వేశారు. కాగా, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ బాధ్యతలు తీసుకున్నారు. ‘పార్లమెంటు లోపల కార్యక్రమాలకు నేతృత్వం వహించడానికి రాహుల్ గాంధీ సరైన వ్యక్తి అని సీడబ్ల్యూసీ భావిస్తున్నది. రాజ్యాంగాన్ని పరిరక్షించే సంకల్పం, చురుకుదనం, జాగరూకతగా ప్రతిపక్షం ఉండాలంటే దానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించడం సరైందని అనుకుంటున్నది. సీడబ్ల్యూసీ తీర్మానం కూడా ఇదే’ అని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీడబ్ల్యూసీ సభ్యుల సెంటిమెంట్లను గౌరవిస్తారని, ఈ ప్రతిపాదనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ తెలిపినట్టు వివరించారు.