Mahaboobabad Lok Sabha Fight
Politics

Mahaboobabad : మానుకోట బాద్‌షా ఎవరో?

– ప్రచారబాట పట్టిన ప్రధాన పార్టీ అభ్యర్థులు
– గెలుపుపై హస్తం ధీమా, మెజారిటీపై అంచనాలు
– పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ యత్నాలు
– ఉనికి కోసం కమలనాథుల పాట్లు
– ఆదివాసీల తరపున ఇద్దరు ఇండిపెండెంట్లు
– సగం ఓటర్ల వయసు 40 ఏళ్ల లోపే

Mahabubabad lok sabha constituency(Telangana politics): తెలంగాణలోని ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గాల్లో మహబూబాబాద్ ఒకటి. 2009 నాటి నియోజక వర్గాల పునర్విభజనలో ఏర్పడిన ఈ స్థానంలో రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్రమంత్రి పి. బలరాం నాయక్, బీజేపీ నుంచి ప్రొఫెసర్ సీతారామ్ నాయక్, బీఆర్ఎస్ నుంచి మలోత్ కవిత అభ్యర్థులుగా ఖరారయ్యారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు సుమారు 15.27 లక్షల ఓట్లు ఉన్నాయి. వీరిలో 40 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య 7,66,849. అంటే మొత్తం ఓటర్లలో సగం మంది యువతే కావటం గమనార్హం.

2009లో నియోజక వర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన పోరిక బలరాంనాయక్‌, మహాకూటమి తరపున బరిలో నిలిచిన సీపీఐ అభ్యర్థి కుంజా శ్రీనివాసరావుపై 68,957 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం తరపున డీటీ నాయక్ కూడా పోటీ చేశారు. అప్పట్లో బలరాం నాయక్‌ను కేంద్రమంత్రి పదవి కూడా వరించింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రొ. సీతారాం నాయక్, కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ మీద 34,992 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. 2019లో బీఅర్ఎస్ అభ్యర్థి మలోత్ కవిత, కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌పై 1,46,660 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా మరోమారు ఈ ముగ్గురు మాజీ ఎంపీలు పోటీకి దిగుతున్నారు. ఈసారి ఇక్కడ ఎవరు గెలిచినా ఈ స్థానం నుంచి రెండోసారి గెలిచిన రికార్డు సొంతం చేసుకోనున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులూ లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారే కావటం మరో విశేషం.

ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట్, భద్రాచలం, పినపాక, ఇల్లందు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో తొలి 4 స్థానాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిధిలోనివి కాగా తర్వాతి 3 సీట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోనివి. వీటిలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట్ పరిధిలో భారీగా లంబాడ ఓటర్లు, భద్రాచలం, పినపాక, ములుగు సెగ్మెంట్ల పరిధిలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ ఓటర్లున్నారు. ఈ 7 సీట్లలో భద్రాచలం మినహా మిగిలిన అన్ని స్థానాలనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటంతో ఈ సీటులో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతోందనే అంచనాలున్నాయి. ఈ సీటులో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులూ ప్రచారాన్ని ప్రారంభించి జనంతో మమేకమవుతున్నారు.

గెలుపుపై హస్తం ధీమా

కాంగ్రెస్ పార్టీ ఈసారి ఈ సీటును భారీ మెజారిటీతో గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది. మార్చిలో భద్రాచలంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొని అభ్యర్థి బలరాం నాయక్‌కు మద్దతుగా తమ ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించారు. జిల్లాకు చెందిన మంత్రి సీతక్క కూడా బలరాం నాయక్‌తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ సీటు ప్రచార బాధ్యతలు తీసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ వరుసగా రెండుసార్లు ఇక్కడ ఓడినా, పార్టీ కార్యకర్తలతో మమేకమై పనిచేస్తూ వచ్చారు. 2023లో మహబూబాబాద్ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడినా, పార్టీ విజయం కోసం చిత్తశుద్దితో పనిచేయటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఈయన పట్ల మంచి అభిప్రాయం ఉంది. మరోవైపు ఇక్కడున్న 7 అసెంబ్లీ సీట్లలో హస్తం అభ్యర్థులే ఉండటం ఆయనకు కలిసొచ్చే మరోఅంశం.

విపక్షాల వ్యూహాలు

మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపి మాలోత్ కవిత కూడా ప్రచారం ఆరంభించారు. మాజీ మంత్రులు రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్‌తో కలిసి మరిపెడ నుంచి ప్రచారం షురూ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గుర్తుచేస్తూ తనకు అండగా నిలవాలని ఓటర్లను కోరుతున్నారు. అయితే, కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత నేతలు, కార్యకర్తలు పార్టీని వీడటం ఆమెకు ప్రతికూలంగా మారుతోంది. క్షేత్ర స్థాయి కేడర్‌, పార్టీకి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండటం, గతంలో ఎంఎల్‌ఎగా పనిచేయడం, తండ్రి, మాజీమంత్రి రెడ్యా నాయక్‌కు ఉన్న పరిచయాలు తనను గట్టెక్కిస్తాయని కవిత భావిస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రొ. సీతారాం నాయక్ పరిస్థితి భిన్నంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఈయన చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ పొందటంతో బీజేపీ స్థానిక నేతల నుంచి ఈయనకు ఆదరణ కరువైంది. దీంతో ఆయన కేంద్ర పథకాలు, మోదీ చరిష్మా మీదనే పూర్తిగా ఆధారపడి ప్రచారం చేస్తున్నారు.

ఆదివాసీల అసంతృప్తి

ఈ స్థానంలో సుమారు 4 లక్షల ఆదివాసీ ఓటర్లున్నా, ప్రధాన పార్టీలేవీ తమ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవటంపై ఆదివాసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇల్లెందు, పినపాక, భద్రాచలం, ములుగు ఎమ్మెల్యే సీట్లు ఆదివాసీలకు ఇచ్చిన ప్రధాన పార్టీలు, లోక్‌సభ సీటు వద్దకు వచ్చేసరికి లంబాడాలకే ప్రతిసారీ సీటు కేటాయిస్తున్నాయనేది వీరి వాదన. మైదానప్రాంత ఎస్టీలైన లంబాడాలను ఎస్టీ రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలని 40 ఏళ్లుగా పోరాడుతున్న తుడుందెబ్బ తరపున తమ అభ్యర్థిని నిలుపుతామని ఆదివాసీ నేతలు హెచ్చరిస్తున్నారు. 2019లో తెలంగాణ జనసమితి తరపున ఇక్కడ పోటీచేసిన ఆదివాసీ అభ్యర్థి మైపతి అరుణ్ కుమార్ అప్పట్లో 57 వేల ఓట్లు పొందగా, ఆయన మరోమారు బరిలో నిలవనున్నట్లు ప్రకటించగా, కాంగ్రెస్ సీటు ఆశించి భంగపడ్డ చందా లింగయ్య కూడా బరిలో నిలుస్తానని ప్రకటించారు.

ప్రచారాస్త్రాలివే..

బయ్యారం ఉక్కు పరిశ్రమ వైఫల్యం, మంజూరైన గిరిజన యూనివర్సిటీ అభివృద్ధి, అపరిష్కృతంగా ఉన్న పోడు భూముల సమస్యలు ఇక్కడ ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఉన్నాయి. అయితే, వీటికంటే స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా వివిధ సంఘాల భవనాలు, రోడ్డు, మంచి నీటి పథకాలతో పాటు తండాల్లో యువతకు మేలుచేసే హామీలిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు బరిలో దిగారు.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్