Politics, Top Stories

Telangana:గెలిస్తే ఫంక్షన్..ఓడితే జంక్షన్

  • మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
  • తెలంగాణ 17 నియోజకవర్గాలలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే
  • ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఒకటి లేక రెండు స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం
  • గెలిచిన అభ్యర్థులు సంబురాలతో ఫంక్షన్ చేసుకునేందుకు సిద్ధం
  • ఓడిన అభ్యర్థులు జంక్షన్ లో నిలబడి తమ భవితవ్యంపై ఆలోచనలు
  • పాత బస్తీలో ఎంఐఎం గెలుపు ఖాయం అంటున్న రాజకీయ పండితులు
  • మిగిలిన 16 స్థానాలలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ
  • ఎవరి ధీమా వారిది…ఎవరి లెక్కలు వారివి

Lok sabha results tension telangana 17 constitutions:

మరికొద్ది గంటల్లో అభ్యర్థుల గుండెల్లో బాంబులే పేలుతాయో..భావోద్వేగాలు వెల్లివిరుస్తాయో తేలిపోనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలతో కొందరు నేతలు లెక్కలు వేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. మరికొందరు నేతలైతే ఓడిపోతే తమ పరిస్థితి ఏమిటి? ఉన్న పార్టీనే నమ్ముకోవాలా? లేక వేరే పార్టీకి జంప్ చేయాలా? మరో ఐదేళ్ల పాటు తమ భవిష్యత్తు ఏమిటని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 17 నియోజకవర్గాలలో ఒక స్థానం ఎంఐఎం గెలుపు దాదాపు ఖరారైపోయిందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన 16 నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గెలిచిన అభ్యర్థులు ఎలాగూ విందు, వినోదాలతో ఫంక్షన్లు చేసుకుంటారు. ఓడిన అభ్యర్థులు మాత్రం చౌరాస్తాలో నిలబడి తమ భవిష్యత్ ఏమిటా అని ఆలోచించుకుంటారు. ఏ పార్టీ మారాలో లేక ఉన్న పార్టీలోనే సర్ధుకుపోవాలో? రాబోయే ఐదేళ్లూ తమ భవిష్యత్ ఏమిటా అని నాలుగు రోడ్ల జంక్షన్ లో నిలబడి ఆలోచించుకుంటూ ఉంటారు.

ఫలితాలపై ఉత్కంఠ

అన్ని పార్టీల అభ్యర్థులూ జూన్‌ 4వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఇతర వ్యాపకాలేవీ పెట్టుకోవడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల సంభాషణలతోనే గడిపేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇప్పటికీ ముఖ్య నాయకులతో సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. పోలింగ్‌ తీరు, పెరిగిన ఓటింగ్‌ శాతం, బూత్‌ల వారీగా ఓట్ల వివరాలను పరిశీలిస్తూ ఒకటికి పదిసార్లు లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు తాము పెట్టిన ఖర్చు లెక్కలు తేల్చుకునే పనిలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ కు చెందిన నలుగురైదుగురు అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా ఓటింగ్‌ తీరు ఆశాజనకంగా లేదన్న భావనలో మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అందరిలోనూ జూన్‌ 4 టెన్షన్‌ నెలకొంది.
సార్వత్రిక ఎన్నికల సమరంలో హోరాహోరీగా మూడు పార్టీలూ తలపడ్డాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వలేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్యే రసవత్తర పోరు సాగనుంది. అయితే, ఈ పదిహేడు నియోజకవర్గాల్లో ద్విముఖ పోరు ఎలా ఉండనుంది అనే ఆసక్తికర చర్చ మొదలైంది. బీఆర్ఎస్ కు ఒకటో రెండో స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న నేపథ్యంలో మరి ఈ 17 నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..

1.హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 4 దశాబ్దాలుగా అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. ఈ ఎన్నికల్లో కూడా ఆయనే ఎంఐఎం అభ్యర్థిగా గెలవబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే తొలిసారి బీజేపీ తరపున పోటీ చేసిన మాధవీ లత రాజకీయాలలో కొనసాగుతారా లేక మళ్లీ ఆధ్యాత్మిక చింతన దిశగా వెళతారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2.సికింద్రాబాద్: సికింద్రాబాద్ లో మూడు పార్టీలు ముఖ్య నేతల్ని బరిలో దింపడంతో త్రిముఖ పోటీ గట్టిగా ఉండనుంది. బీజేపీ నుండి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్.. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, బీఆర్ఎస్ నుండి సీనియర్ నేత టి.పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో ఇక్కడ ఎవరు గెలవనున్నారు అనే అంశం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే బీజేపీ నేత కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఇద్దరి మధ్య పోటీ హారాహోరీగా సాగనుంది. ఒకవేళ ఓడిపోయే పరిస్థితి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పరిస్థితి ఏమిటనేది సందేహం. ఆయన కూడా పార్టీ మారతారా అనే చర్చ నడుస్తోంది.

3.మల్కాజిగిరి : మల్కాజిగిరి పార్లమెంటు సీటు కోసం టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఈ స్థానంలో రాష్ట్ర బీజేపీలో ప్రధాన నేతగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. మల్కాజిగిరి పరిధిలో అసెంబ్లీ స్థానాలన్నీ క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్, తన సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి, మల్కాజిగిరిలో బోణీ కొట్టాలని బీజేపీ.. గెలుపు కోసం నిరీక్షిస్తున్నాయి.

4.ఆదిలాబాద్ : ఈ సెగ్మెంట్ లో బీజేపీ నుంచి పోటీ చేస్తోన్న గోడం నగేష్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఆదిలాబాద్ లో బీజేపీకి బలమైన వోటింగ్ ఉండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఎన్నికల రాజకీయాలకు కొత్త అయిన ఆత్రం సుగుణను కాంగ్రెస్ ఎంపిక చేసింది. కాంగ్రెస్ ఇక్కడ బలంగా లేదనే చెప్పాలి. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును బీఆర్ఎస్ నామినేట్ చేసింది. ఆయన లోక్‌సభ ఎన్నికలకు బలమైన అభ్యర్థి కాదని కొందరు విశ్వసిస్తున్నప్పటికీ, ఈ సెగ్మెంట్‌లో గులాబీ పార్టీకి గణనీయమైన ఓట్లు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.

5.భువనగిరి : ఈ సెగ్మెంట్‌లో పోటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కొత్త అభ్యర్థులైన క్యామ మల్లేష్, చామల కిరణ్ రెడ్డిని ఎంపిక చేశాయి. తమకు పెద్దగా పేరు లేకపోయినా, పార్టీల బలాన్ని చూసి ఓట్లు పడతాయనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు బీజేపీ టికెట్ కేటాయించింది. ఆయనకు ఈ సెగ్మెంట్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది కానీ గత ఎన్నికల్లో కాషాయ పార్టీ ఇక్కడ పెద్దగా రాణించకపోవడం ప్రతికూల అంశం.

6.చేవెళ్ల : బీజేపీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఎంపిక చేసింది. ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఈ సెగ్మెంట్‌లో పార్టీకి అంత బలం లేదు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ జి రంజిత్ రెడ్డిని రంగంలోకి దింపింది, ఇటీవలే ఆయన బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను బీఆర్‌ఎస్ రంగంలోకి దించింది. ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ సెగ్మెంట్‌లో పార్టీ ఉనికి కోసం కష్టపడుతోంది.

7.కరీంనగర్ : ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 300 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి కరీంనగర్ లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు. ప్రత్యర్థులకు భిన్నంగా ఆయన కూడా దూకుడుగా ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ను రంగంలోకి దింపింది. ఇక్కడి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి గణనీయమైన ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ సీటు గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్నాయని పార్టీ అంతర్గత వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఇక్కడ రాణించలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అధికార కాంగ్రెస్ సంక్షేమ పథకాలు తనని గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు.

8.ఖమ్మం : బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చింది. ఈ సెగ్మెంట్‌లో ఆయనకి మంచి గుర్తింపు ఉంది.ఇటీవలి జరిగిన ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ సెగ్మెంట్ లోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ మంచి పనితీరు కనబరిచింది. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరు స్థానాలను గెలుచుకుంది. రామసహాయం రఘురామ్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయంటున్నారు. కాగా బీజేపీ నుంచి టి వినోద్‌రావు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు.

9.మహబూబాబాద్ : బీఆర్‌ఎస్‌లోని సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీలు పీ బలరాం నాయక్, బీజేపీకి చెందిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ మధ్య పోరు సాగనుంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ మాదిరిగానే బీఆర్‌ఎస్‌ కూడా గణనీయమైన ఓట్లను సాధించింది. మరోవైపు ఈ సెగ్మెంట్‌లో బీజేపీకి అంతగా బలం లేదు.

10.మహబూబ్ నగర్ : ఇక్కడ ప్రధాన పోరు వంశీచంద్ రెడ్డి (కాంగ్రెస్), డికె అరుణ (బిజెపి) మధ్యనే ఉంది. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ ఎం.శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీ నుండి బరిలో ఉన్నప్పటికీ యాక్టివ్ గా ప్రచారం చేయలేదని అంటున్నారు.

11.మెదక్ : బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావుకు సెగ్మెంట్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. మెదక్ నియోజకవర్గం పరిధిలోని దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో కాషాయ పార్టీకి పెద్దగా ఓట్లు రాకపోవడంతో ఆ ఒరవడిని తిప్పికొట్టడం ఆయనకు పెద్ద సవాలుగా మారనుంది. బీఆర్‌ఎస్‌కు చెందిన పి.వెంకటరామ్‌రెడ్డి బలమైన అభ్యర్థిగా పరిగణించబడట్లేదు. అయితే ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు అధినేత కే చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆ పార్టీకి ఇక్కడ మంచి మద్దతు ఉంది. రాజకీయంగా పెద్ద‌గా పేరు లేని నీలం మ‌ధు అనే తాజా ముఖాన్ని కాంగ్రెస్ ఎంచుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ ప‌రిస్థితి కూడా బాగా లేక‌పోవ‌డం హస్తం పార్టీకి కొంత ప్రతికూల అంశమే.

12.నాగర్ కర్నూల్ : బీజేపీ సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు భరత్‌ను బరిలోకి దింపింది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ కాషాయ పార్టీకి పెద్దగా ఆదరణ లభించలేదు. కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవిని రంగంలోకి దింపింది. ఆయనకు మంచి పేరుంది, ఈ సెగ్మెంట్‌లో పార్టీకి కూడా మంచి మద్దతు ఉంది. ఇటీవల బీఎస్పీని వీడి బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ కు కేసీఆర్ టికెట్ కేటాయించారు. పార్టీకి బలమైన పునాది ఉన్నప్పటికీ, అభ్యర్థికి కీలకమైన బీఆర్ఎస్ నాయకుల నుండి మద్దతు కరువైంది.

13.నల్గొండ : గతంలో ఎన్నడూ నల్గొండలో గెలవని బీఆర్ఎస్.. ఇక్కడ కంచర్ల కృష్ణా రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. కాంగ్రెస్ సీనియర్ రాజకీయ నాయకుడు కె.జానా రెడ్డి తనయుడు రఘువీరారెడ్డిని రంగంలోకి దింపింది. గతంలో జరిగిన అన్ని లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీ ఇక్కడ మంచి ఫలితాలు సాధించడం ఈసారి ఆయనకు మేలు చేసే అవకాశం ఉంది. హుజూర్‌నగర్‌లో మాత్రమే ఇమేజ్ ఉన్న మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని బీజేపీ ఎంపిక చేసింది. గత ఎన్నికల్లో పార్టీ పెద్దగా రాణించకపోవడంతో ఈ సీటును దక్కించుకోవడం ఆయనకు పెద్ద సవాల్‌గా మారనుంది.

14.నిజామాబాద్ : ఈ సెగ్మెంట్‌లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్నారు. సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. ఎవరు గెలుపుజెండా ఎగరేస్తారు అనే ఉత్కంఠ ఏర్పడింది.

15.పెద్దపల్లి : బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఈ సెగ్మెంట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ బాగానే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ బలమైన అభ్యర్థి కానప్పటికీ, ఇక్కడ గతంలో ఎంపీలుగా పని చేసి ఆదరణ పొందిన గడ్డం వెంకట స్వామి, గడ్డం వివేక్ ల ఓటు బ్యాంక్ హెల్ప్ రావొచ్చని ఆశపడుతున్నారు. మరోవైపు బీజేపీకి చెందిన గోమాస శ్రీనివాస్ కూడా ప్రత్యర్థులను ఓడించి సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు.

16.వరంగల్ : మొదట కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ పోటీగా భావించినా, బీఆర్‌ఎస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ను బీజేపీ ఎంపిక చేయడంతో త్రిముఖ పోరుగా మారింది. తొలుత కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించిన గులాబీ పార్టీ.. ఆమె కాంగ్రెస్‌లోకి మారి టికెట్ పొందిన తర్వాత ఉద్యమకారుడు, హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ ని అభ్యర్థిగా ఖరారు చేసింది.

17.జహీరాబాద్ : బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ కుమార్‌ ఎంపీలుగా పనిచేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన ఓట్ల శాతం ఉండటంతో కలిసొస్తుందని ఆశిస్తున్నారు. ఈ సెగ్మెంట్ నుంచి తొలిసారిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్‌ను బీఆర్‌ఎస్ రంగంలోకి దింపింది. ఈయన 2019లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు