loan recovery targets to staff of nizamabad dccb | Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు Swetchadaily | Telugu Online Daily News
Nizamabad DCCB
Political News

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

– రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ
– నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది దూకుడు
– పొలం వద్ద ఎర్రజెండాలు పాతి బెదిరింపులు.. వివాదాస్పదం
– బడాబాబులను వదిలి రైతులే టార్గెట్‌గా యాక్షన్
– ఇంకా 130 కోట్ల బకాయిలు పెండింగ్

Nizamabad DCCB: ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిజామాబాద్ సహకార బ్యాంక్ ఇప్పుడు అప్రతిష్టను మూటగట్టుకుంటున్నది. గత పాలకవర్గాలు తీసుకున్న ఇష్టారీతి నిర్ణయాలు, అడ్డగోలుగా ఇచ్చిన దీర్ఘకాలిక రుణాలతో ప్రస్తుతం డీసీసీబీ గింజుకుంటున్నది. రుణాల రికవరీ కోసం తంటాలుపడుతున్నది. తప్పకుండా ఈ నెలాఖరులోపు రుణాలను రికవరీ చేయాలని టార్గెట్లు ఫిక్స్ చేయడంతో సిబ్బంది దూకుడుగా వ్యవహరిస్తున్నది. కొందరు నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తుండటం వివాదాస్పదం అవుతున్నది. అదీ ప్రాబల్యమున్న వారిని వదిలి రైతులనే టార్గెట్‌ చేసుకుని పని చేయడం విమర్శలకు తావిస్తున్నది.

ఆరోపణల పర్వం..

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు.. రుణాల మంజూరీలో చాలా చోట్ల మార్గదర్శకాలను పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. కొందరికి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇచ్చినట్టు ఆరోపిస్తున్నారు. పలుకుబడి, ప్రాబల్యం ఉన్నవారు సొసైటీ కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకున్నట్టూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు.

రైతుకు బెదిరింపు..

ఈ నెలాఖరులోపు బకాయిలు వసూలు చేయాలని అధికారులు టార్గెట్ ఫిక్స్ చేశారు. దీంతో సిబ్బంది కొంత దూకుడు, మరికొంత దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. లింగంపేటలో హద్దుమీరారు. ఓ రైతు పొలం వద్ద ఎర్రజెండాలు పాతి.. భూములు స్వాధీనం చేసుకుంటామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బెదిరించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వానికే చెడ్డపేరు తెచ్చేలా ఉన్నదని గ్రహించి అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. కాగా, సహకార బ్యాంకు తీరును రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బకాయిల వసూళ్లలో పలుకుబడి ఉన్నవారి జోలికి పోవడం లేదని, రైతులను మాత్రం భూములు స్వాదీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు కూడా ప్రకటించింది.

రావాల్సిన బకాయి ఎంత?

పలువురు రుణగ్రహీతలు రెండేళ్లుగా బకాయిలు చెల్లించడం లేదు. దీంతో మొండిబకాయిల వసూళ్ల కోసం బ్యాంకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. మొత్తం రూ. 250 కోట్ల బకాయిల్లో ఈ డ్రైవ్ ద్వారా రూ. 139 కోట్లు వసూలు చేయగలిగారు. మరో రూ. 111 కోట్లు వడ్డీతో కలిపి మొత్తం రూ. 130 కోట్ల వరకు బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

రుణమాఫీపై ఆశలు

నాబార్డు, టెస్కాబ్ వంటి సంస్థల నుంచి డీసీసీబీ రుణాలు తెచ్చి ఖాతాదారులకు లోన్లు ఇచ్చింది. తిరిగి ఆ సంస్థలకు చెల్లించాలంటే రుణగ్రహీతల నుంచి బకాయిలు చెల్లించాల్సిందే. ఈ రికవరీ కోసం బ్యాంకు వ్యూహాత్మకంగా ఆలోచనలు చేస్తున్నది. మొండి బకాయిల కోసం ప్రత్యేక రాయితీలు అవకాశాలు ఇస్తున్నది. జూన్ చివరి వరకు వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అవకాశం ఇచ్చింది. కానీ, ఈ అవకాశాన్ని కూడా కొందరు వినియోగించుకోవడం లేదు. ఇందులో రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులు కూడా ఇందులో ఉన్నారు. రుణమాఫీ స్వల్పకాలిక రుణాలకు మాత్రమే వర్తించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే నిజమైతే ముందుగా బ్యాంకు అధికారులు అలాంటి రైతుల్లో అవగాహన పెంచాల్సి ఉంటుంది.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క