Elections: లోక్ సభ ఎన్నికలు చివరి అంకానికి చేరాయి. చిట్ట చివరి ఏడో విడత పోలింగ్ రేపు జరగనుంది. ఏడో విడత పోలింగ్‌కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఈ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసికి పోలింగ్ జరుగుతుంది. ఈ విడతకు సంబంధించి ప్రచారానికి తెరపడి సైలెంట్ పీరియడ్ మొదలుకాగానే ఆయన కన్యాకుమారికి వెళ్లి ధ్యానముద్రలో ఉన్నారు.
ఒడిశాలో 42 సీట్లకు, బిహార్‌లో 8, చండీగఢ్‌లో ఒకటి, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో మూడు, ఒడిశాలో 6, యూపీలో 13, పశ్చిమ బెంగాల్‌లో 9 సీట్లల్లో పోలింగ్ జరుగుతుంది. 57 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విడతలో 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉన్నది. ఇందులో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళా ఓటర్లతోపాటు 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
పోలింగ్, భద్రతా సిబ్బంది తరలింపు కోసం 13 ప్రత్యేక రైళ్లు, 8 హెలికాప్టర్ సార్టీలు, కొన్ని చోట్ల పడవలనూ ఉపయోగించారు. 172 మంది పరిశీలకులను ఈసీ నియమించింది. ఇందులో 64 సాధారణ పరిశీలకులు, 32 మంది పోలీసు పరిశీలకులు, 76 మంది వ్యయ పరిశీలకులు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు చేరుకున్నారు. 2707 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 2799 స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్‌లు, 1080 నిఘా బృందాలు, 560 వీడియో వ్యూయింగ్ టీమ్‌లు ఎన్నికల విధుల్లో పాల్గొంటాయి. ఈ విడత కోసం గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. సముద్ర, వాయు మార్గాల్లో గట్టి నిఘా పెట్టారు.