KTR Slams Congress Govt | ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
KTR
Political News

KTR : బీజేపీతో దొంగాట

– కాంగ్రెస్‌పై కేటీఆర్ నిప్పులు
– బీజేపీ, రేవంత్ దోస్తులని కామెంట్
– త్వరలో బీజేపీలోకి రేవంత్
– చేవెళ్ల చెత్త.. సిటీకొచ్చిందని విమర్శ

KTR Slams Congress Govt (political news in telangana): గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీల అమలు ఇంకెప్పుడంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం మ‌ల్కాజ్‌గిరి ఎంపీ సీటు పరిధిలోని మేడిప‌ల్లిలో నిర్వహించిన పార్టీ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని సీఎం రేవంత్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస ఇచ్చిన హామీలను 420 హామీలుగా ఆయన అభివర్ణించారు. హామీల అమలు జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడి తీరతామని హెచ్చరించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో కలసి దొంగాట ఆడుతోందని కేటీఆర్ ఆరోపించారు. చేవెళ్లలో పనికి రాని చెత్తను మల్కాజ్‌గిరి తీసుకొచ్చి పడేశారని మండిపడ్డారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని చూస్తే బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న అవగాహన బయటపడుతుందని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ తేల్చుకోలేకపోతోందని, కనుక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులందరినీ ఓడించాలని పిలుపునిచ్చారు. తన ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే మాట్లాడుతున్నారని, ఆ పని చేసేందుకు ఆ పార్టీలోనే నాయకులు ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, తెలంగాణ ప్రజలే ప్రభుత్వాన్ని పడగొడతారని, విపక్ష పార్టీగా తమకు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ మీద పెట్టిన శ్రద్ధ, వాటర్ ట్యాప్‌ల మీద పెడితే జనం సంతోషిస్తారంటూ సలహా ఇచ్చారు.

ఉగాది పచ్చడి రుచి మాదిరిగా రాజకీయంలో చేదు, తీపి అనుభవాలుంటాయని, కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక అయిన బీఆర్ఎస్ పార్టీ వాటికి అతీతంగా ముందుకు సాగాల్సిన అవసరముందని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ 14 సంవత్సరాల పోరాటంతోనే తెలంగాణ సాకారమైందని, అధికారంలో ఉన్న కాలంలో విద్యుత్, సాగునీరు వంటి అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధించామని, సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరువ చేశామని ఆయన గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ మోసపూరిత హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించి దొడ్డిదోవన అధికారంలోకి వచ్చిందని, నేటికీ వారి హామీలు అమలు కాలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరతాడని జోస్యం చెప్పారు.

కేంద్రంలోని మోదీపైనా కేటీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో విపక్షాలు బతికే అవకాశమే లేకుండా బీజేపీ నాయకత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్, కేసీఆర్ పేరును మాయం చేసేందుకు బీజేపీతో రేవంత్ రెడ్డి చేతులు కలిపాడన్నారు. గత పదేళ్లలో 10 రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని మండిపడ్డారు. విపక్షాలు ఉంటే తన జేబులో లేదా జైలులో ఉండాలనే మోదీ ఆలోచనకు అనుగుణంగానే రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆరోపించారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?