KTR Challenges: ఆరు గ్యారెంటీల అమలుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సవాల్ చేశారు. దాదాపు అన్ని గ్యారెంటీలను అమలు చేశామని భట్టి చేసిన ప్రకటనపై మండిపడ్డారు. దమ్ముంటే ఇదే మాట తెలంగాణలోని ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు. ఎక్స్ వేదికగా భట్టిపై ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్, భట్టి లాంటి కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీ కార్డులను దాచుకోండి, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలను నెరవేర్చుతామని ప్రజలను మభ్యపెట్టారన్నారు.
Also Read: Dating With AI: 5 నెలలుగా ఏఐతో డేటింగ్.. నిశ్చితార్థం కూడా జరిగింది.. యువతి షాకింగ్ ప్రకటన!
ఇప్పుడు వంద రోజులు కాదు, రెండేళ్లు గడిచిపోయినా ఒక్క హామీని కూడా అమలు చేయని ప్రభుత్వం, అన్నీ చేశామంటూ చెప్పడం ప్రజలను మోసగించడమేనని మండిపడ్డారు. ఆరు గారంటీల అమలు విషయంలో, ఇచ్చిన 420 హామీల అమలుపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం, ప్రాపగండాను చూసి ప్రజలు అసలు నిజం అర్థం చేసుకున్నారని, అందుకే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తరిమేస్తున్నారన్నారు. భట్టితో పాటు క్యాబినెట్‌లో ఉన్న ఏ మంత్రి అయినా రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్లి, అన్ని హామీలు అమలు చేశామని ప్రజల ముందు చెప్పాలని సవాల్ చేశారు.
అండగా ఉండండి..
‘దమ్ముంటే చెప్పండి.. చెప్పిన తర్వాత ప్రజలు మిమ్మల్ని తరిమి వేయకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కాంగ్రెస్(Congress) ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న అబద్ధాలకు, ప్రాపగండాకు ప్రతి గ్రామంలో ప్రజలే సమాధానం చెబుతారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్(BRS) శ్రేణులు, ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలి.
ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన ఈ కాంగ్రెస్(Congress) ప్రభుత్వం చర్యలు తీసుకున్నా లేకపోయినా, ప్రతిపక్షంగా మన బాధ్యత ఎక్కువని గుర్తుచేస్తూ, బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి త్రాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్టలు వంటి కనీస అవసరమైన సహాయాన్ని అందించాలి. అత్యవసర వైద్య అవసరాల కోసం కూడా అవసరమైన చోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి. ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. అందరూ ధైర్యంగా ఉండాలి’ అని కేటీఆర్ అన్నారు.
Also Read: Chitrapuri 300 Cr Scam: చిత్ర పురిలో రూ.300 కోట్ల స్కాం.. అధ్యక్షుడిని అరెస్టు చెయ్యాలని డిమాండ్