Kishan Reddy: ప్రభుత్వ ఉద్యోగి అరెస్టయి 48 గంటలపాటు జైల్లో ఉంటే ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddyb) అన్నారు. అలాంటిది రాజ్యాంగ బద్ధంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు అరెస్టయితే తీవ్రమైన నేరారోపణలో జైలుకెళితే వారిపై కనీస చర్యలుండవా అని ప్రశ్నించారు. దీనిపై లోక్ సభలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు, వారి అభిప్రాయాలు దురదృష్టకరమని విమర్శలు చేశారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
Also Read: GHMC – Hydraa: అమీర్ పేట మైత్రివనం ఏరియా లపై జాయింట్ ఫోకస్!
130వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు ఎవరైనా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొని అరెస్టయి 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే పదవి నుంచి తొలగిపోవాలనే ఆలోచనతో కేంద్రం ఈ సంస్కరణను తీసుకొచ్చిందన్నారు. దీనిపై రాజ్యసభలో చర్చ జరిగిందని, తదుపరి జేపీసీలో చర్చించనున్నారని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ కోసం తీసుకొచ్చిన చట్టం కాదని, అన్ని పార్టీలకు ఇది వర్తిస్తుందనే విషయం ఆ నేతలకు అర్థం కావడం లేదా అని నిలదీశారు.
దిగజారుడు రాజకీయాలు అవసరమా?
1995లో హవాలా కేసులో సీబీఐ పలువురు నేతలతోపాటు ఎల్‌కే అద్వానీ పేరు చేర్చినప్పుడు కేసు నుంచి బయట పడేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 1997లో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత 1998లో పోటీ చేశారన్నారు. 2005లో సోరాబుద్ధీన్ ఎన్ కౌంటర్ కేసులో నాటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా పేరు సీబీఐ చార్జిషీటులోఉంటే ఆయన మంత్రిగా రాజీనామా చేసి 2014లో ఆయన ప్రమేయం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతే పార్టీ బాధ్యతలు చేపట్టారని, ఆ తర్వాత లోక్ సభకు పోటీ చేశారన్నారు. జార్ఖండ్ సీఎం కూడా ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేసి జైలుకెళ్లారని కేంద్రమంత్రి గుర్తుచేశారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ అరెస్టయి 6 నెలలు జైల్లో ఉండి అక్కడినుంచే రివ్యూ మీటింగ్స్ పెట్టారని, ఐఏఎస్ అధికారులు అక్కడకు వెళ్లి ఆయనకు బ్రీఫ్ చేసేవారన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
నైతిక విలువల కోసమే..
న్యాయస్థానం ఎదుట కేజ్రీవాల్ ఆధారాలతో సహా తప్పు చేశారని తేలినప్పుడే ఆయన్ను జైల్లో పెట్టారని కిషన్ రెడ్డి వివరించారు. అయినా ఆయన రాజీనామా చేయలేదన్నారు. తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ కూడా రాజీనామా చేయలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడేందుకు ఇలాంటి రాజ్యాంగ సంస్కరణ తీసుకొచ్చిందని, దీనికి స్వాగతించి మద్దతుగా నిలవాల్సిన విపక్షాలు విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. లాలూ ప్రసాద్‌పై ఆరోపణలు వస్తే ఆయన్ను కాపాడేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చారని, దీన్ని రాహుల్ గాంధీ చింపివేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాహుల్, లాలూ ప్రసాద్ ఒకే వేదికపై కౌగిలించుకుంటున్నారని విమర్శలు చేశారు.
Also Read: Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పదునైన విమర్శలు