– కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, సంజయ్ బాధ్యతల స్వీకరణ
– దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడి
Kishan Reddy: ఢిల్లీలో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. శాస్త్రి భవన్‌లో కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. బండి సంజయ్ నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో సహాయ మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. ముందుగా తెలంగాణ భవన్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇద్దరు నేతలు. ఆ తర్వాత ఏపీ భవన్‌లోని వెంకటేశ్వర స్వామి, దుర్గమ్మ తల్లి ఆలయంలో కిషన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11.30 నిమిషాలకు శాస్త్రి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అనంతరం, కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ లేకుండా ఏ పనీ కాదని, సాగుకైనా, పరిశ్రమలకైనా విద్యుత్ అనివార్యమని గుర్తు చేశారు. విద్యుత్ కోతలతో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని, కానీ, మోదీ ప్రభుత్వం వచ్చాక నిరంతరం విద్యుత్ అందిస్తూ అన్ని రంగాలను ఆదుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికీ పెద్ద మొత్తంలో బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పిన కిషన్ రెడ్డి ఇకపై మన దేశంలోనే మనకు కావాల్సిన బొగ్గును ఉత్పత్తి చేసుకోవడంపై దృష్టి పెడతామని వివరించారు. అలాగే, ఉపాధి అవకాశాలు పెంచడం, భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి అందరూ కలిసి పని చేయాలని తెలిపారు.
ఇక, కరీంనగర్ నుంచి రెండో సారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కి మోదీ కీలక బాధ్యతలు అప్పగించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు కేటాయించగా, నార్త్ బ్లాక్‌లోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని భద్రతా కారణాల రీత్యా సాదాసీదాగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ హాజరయ్యారు. అలాగే, జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి హాజరై బండి సంజయ్‌ను ఆశీర్వదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నేతృత్వంలో దేశ రక్షణ సేవల్లో తన జీవితాన్ని అంకితం చేస్తానని బండి సంజయ్ వెల్లడించారు. ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం నిరంతరం పని చేస్తానని వివరించారు.