– విగ్రహ నిర్మాణ పనులు షురూ
– 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి
– కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
Khairatabad Ganesh: వినాయక చవితి ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేషుడి విగ్రహానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ విగ్రహ నిర్మాణానికి ఉత్సవ కమిటీ శ్రీకారం చుట్టింది. ఖైరతాబాద్ మహా గణేషుడి విగ్రహ నిర్మాణానికి సోమవారం కర్రపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
ప్రతి యేటా నిర్జల ఏకాదశి రోజున విగ్రహ నిర్మాణానికి కర్రపూజను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఈ కర్రపూజ నిర్వహించి ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. ఈ పనులు 82 రోజులపాటు కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ వస్తున్నది. అంతలోపే ఖైరతాబాద్ వినాయక మండపం పనులు పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్టించడం ప్రారంభించి 70 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సారి వినాయక చవితికి ఇక్కడ 70 అడుగుల విగ్రహ విగ్రహాన్ని ప్రటిష్టించాలని ఉత్సవ కమిటీ డిసైడ్ అయింది. భక్తులకు అన్నిరకాల ఏర్పాట్లు చేయడంతోపాటు ప్రసాదాన్ని అందించేలా నిర్ణయం తీసుకుంది. కర్రపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేషుడి ఉత్సవాలు విజయవంతంగా సాగడానికి ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ మతానికి అతీతంగా పాటుపడుతారని చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించాలని, ఈ విషయమై తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మాట్లాడినట్టు వివరించారు.