- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసల జోరు
- స్వయంగా కేసీఆర్ రంగంలో దిగిన ప్రయోజనం శూన్యం
- 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కన్నేసిన కాంగ్రెస్
- ఉన్నవారికి కాపాడుకునేందుకు పథకం రచిస్తున్న కేసీఆర్
- పార్టీ మారిన వారిపై ఫిరాయింపు చట్టం కింద కేసులు
- ప్రజాక్షేత్రంలో ఇక కాంగ్రెస్ విధానాలపై పోరు
- స్వరం పెంచితే వలసలు తగ్గుతాయని భావిస్తు్న కేసీఆర్
- రేవంత్ జిల్లాల కుదింపు అంశాన్ని ధీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్న బీఆర్ఎస్
BRS party latest news(Telangana news live):
ఎలాగైనా మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకుంటే కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరో పక్క ఎంతలా ప్రయత్నిస్తున్నా బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మెట్లు దిగ పోతున్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత తన స్వభావినికి భిన్నంగా కింది స్థాయి కార్యకర్తనుంచి ఎమ్మెల్యేలు దాకా తమ పార్టీవారిని ఫామ్ హౌస్ కు పిలిపించుకుని నచ్చజెప్పే యత్నం చేస్తున్నారు. ఏదోలా చేసి బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం అయ్యే స్థితి రానివ్వకూడదని భావిస్తున్నారు కేసీఆర్. ఎట్టి పరిస్థితిలోనూ తమ ఎమ్మెల్యేలను ఇకపై వదులుకోకూడదని కేసీఆర్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు సమచారం. అవసరం అనుకుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం అమలయ్యేలా.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
స్వరం పెంచితే సరి..
ఇంకా వలసలు ఆపడానికి రేవంత్ సర్కార్ పై తమ స్వరం పెంచాలని భావిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇందుకోసం రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్ అంశాలను తీసుకుని వాటిపైన ఫోకస్ చేద్దామనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటుగా అనేక అంశాల్లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని పార్టీ భావిస్తోంది. దీంతో ప్రభుత్వం మీద పెన్షన్లు, రైతు భరోసా, వడ్లకు బోనస్ ఇలాంటి అంశాలపై ఒత్తిడి తెస్తే పార్టీ నుంచి చేరికలు కూడా ఆగిపోతాయని బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారు.ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబం నుంచే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు మొదటినుంచి ఉద్యమంలో, పార్టీలో కొనసాగిన పద్మారావు, ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్లు ఉన్నారు.వీరితో పాటు పార్టీని అంటిపెట్టుకుని అంకితభావంతో పనిచేసేవారు మరికొదరు ఉన్నారని కేసీఆర్ భావిస్తున్నారు. అలాంటి వారు 15 నుంచి 18 మంది దాకా ఉన్నారని వారు ఎట్టిపరిస్థితిలోనూ పార్టీ మారరని బీఆర్ఎస్ అగ్రనేతలు బలంగా విశ్వసిస్తున్నారని సమాచారం. . అదే జరిగితే బీఆర్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడం సాధ్యంకాదు. వచ్చే ఎన్నికల వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనైతికంగానే కొనసాగాల్సి వస్తుంది. దీనిపై కోర్టులో కేసులు.. స్పీకర్ వద్ద ఫిర్యాదులు కొనసాగుతూనే ఉంటాయి. ఈ రకమైన వ్యూహంతో ఫిరాయింపులను కట్టడి చేయడంతో పాటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.
పథకాలు మారిస్తే నిలదీత
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసినపప్పటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చాలని రేవంత్ సర్కార్ చూస్తోంది. కేసీఆర్ హయాంలో ప్రెస్టేజ్ గా ప్రారంభించిన ధరణి, దళితబంధును పూర్తిగా ఎత్తేసిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే 33 జిల్లాలను 17 జిల్లాలుగా కుదించే యోచనలో రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నదని తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణలో ప్రకంపనలు జరగడం ఖాయం అంటున్నారు రాజకీయ మేధావులు. కొత్త జిల్లాలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సమయంలో ఈ వార్తతో తెలంగాణ అంతటా ప్రజల్లో ఆందోళన, అయోమయం మొదలైంది. కాంగ్రెస్ అనుకున్నట్లుగా.. ఈ నిర్ణయం అమలైతే మాత్రం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుగా రద్దు కానున్నాయి. ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని కాస్త నిశితంగా పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒకరు.. 33 జిల్లాలను కుదించి 17 లోక్‌సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు.. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం అస్సలు ఇన్ని జిల్లాలు ఎందుకు..? వీటి వల్ల ఒరిగేదేంటి..? కచ్చితంగా 33 జిల్లాల్లో కొన్ని రద్దు చేస్తామని కూడా ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. రేవంత్ ఇంటర్వ్యూలో ఇలా చెప్పడం.. ఇప్పుడిలా కీలక నేత మాట్లాడటం వెనుక కచ్చితంగా ఏదో జరుగుతోందని రాష్ట్ర ప్రజలు అయితే ఒకింత ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలు రద్దు చేస్తే జగడమే
కొత్త జిల్లాల పునర్విభజన చేస్తే జరిగే పరిణామాలు చాలానే ఉన్నాయని తెలంగాణ మేథావులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజా సంఘాలు చెబుతున్నాయి. మొదట.. ఏ జిల్లాలు రద్ద్దు అవుతాయో.. ఆయా జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు పడిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రియల్ ఎస్టేట్ కూడా ఢమాల్ అనే పరిస్థితులు మెండుగా ఉన్నాయి. ఇక జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దవుతాయని మేథావులు చెబుతున్నారు. అంతేకాదు.. మళ్ళీ భారీ బదిలీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అస్తవ్యస్తం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు.. ఉన్న మ్యాపులన్నింటినీ తిరగరాయాల్సి ఉంటుంది. ఇక.. పోటీ పరీక్షల సిలబస్ మార్చాల్సి ఉంటుంది. అదేవిధంగా.. జోనల్ విధానం మార్చాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్న మాట. మరీ ముఖ్యంగా.. రెండేళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు.. దీంతో అసలే తెలంగాణలో ఉద్యోగాలు లేక విలవిల్లాడుతున్న నిరుద్యోగులు.. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితి. మరోవైపు.. ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు ఇతర జిల్లా కేంద్ర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగంగా మారిపోతాయి. అదే జరిగితే కేసీఆర్ చేతికి రేవంత్ రెడ్డి అస్ల్రాన్ని ఇచ్చుకున్నట్లే అని అంతా అంటున్నారు.