– హైకోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్
– సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు
– ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్టీ విభాగం
– రైల్ రోకో కేసులో కేసీఆర్‌కు ఊరట
Power Commission: విద్యుత్ కొనుగోళ్లు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నదని ఆరోపించారు. తమ హయాంలో నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని పునరుద్ఘాటించారు. కమిషన్ ఏర్పాటుతోపాటు తీరు కూడా సరిగా లేదని, జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్‌లో ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగాన్ని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టు విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరిగాయి. యాదాద్రి, భద్రాద్రిలో థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ వ్యవహారాల్లో అవినీతి జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై అసెంబ్లీలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. తమ ప్రభుత్వం నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిపిందని, అవసమైతే విచారణ చేసుకోండంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ వ్యవహారాలపై జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నర్సింహారెడ్డి కమిషన్ పలువురు విద్యుత్ శాఖ ఉద్యోగులనూ విచారించింది. ఈ విచారణలో భాగంగానే ఈ నెల 11వ తేదీన మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్ తన సమాధానానికి నెలాఖరు వరకు గడువు కోరగా.. కమిషన్ నిరాకరించింది. అనంతరం, కమిషన్‌కు జూన్ 15వ తేదీన కేసీఆర్ ఘాటు లేఖ రాశారు.
కేసీఆర్ రాసిన 12 పేజీ లేఖ చర్చనీయాంశమైంది. నర్సింహారెడ్డి కమిషన్ పై, ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం వేసిన కమిషన్ చెల్లదని, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాగే.. ఈ అంశాలపై విచారణ జరిపే అర్హత హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డికి లేదని పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తొలగిపోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణ పూర్తి చేయకముందే మీడియా సమావేశం నిర్వహించడం, ఏకపక్షంగా ఆరోపణలు చేయడం తనను బాధించాయని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తికాకముందే తన పేరును ప్రస్తావించడంపైనా అభ్యంతరం తెలిపారు. తమ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు నిబంధనలకు లోబడే జరిగాయని, ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేశారు.
పాత కేసులో ఊరట
రైలు రోకో కేసులో కేసీఆర్ ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు విచారణ పై స్టే ఇచ్చింది. కేసు విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు మూలం 2011లో ఉన్నది. 2011లో కేసీఆర్ రైల్ రోకోకు పిలుపునివ్వడంతో కేసు ఫైల్ అయింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్నది. తాను ఈ ధర్నాలో పాల్గొనలేదని కేసీఆర్ పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతున్న రైల్ రోకో కేసును కొట్టివేయాలని కోరారు. తాజాగా, హైకోర్టు స్టే విధించింది.
కేసీఆర్‌కు నోటీసులు
ఓవైపు పవర్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కమిషన్ ఆయనకు షాకిచ్చింది. కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చింది పవర్ కమిషన్. ఇప్పటి వరకు వచ్చిన సమాచారంపై తమకు అభిప్రాయం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 27వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు జగదీష్ రెడ్డి, మరికొంత మందికి నోటీసులు పంపింది. ఇంతకుముందు ఈనెల 19న కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది కమిషన్. కానీ, ఆయన సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఇదంతా రూల్స్‌కు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడారు. ఇదే క్రమంలో, తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని తెలిపారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కమిషన్ ఆయనకు నోటీసులు పంపండం హాట్ టాపిక్‌గా మారింది.