Delhi : కవితకు అప్రూ‘వర్రీ’ | Swetchadaily | Telugu Online Daily News
MLC Kavitha To Stay In Jail Custody Extended By 14 Days
Political News

Delhi : కవితకు అప్రూ‘వర్రీ’

– కవిత చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు
– సీబీఐకి అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి
– ఇప్పటికే కీలక అంశాల వెల్లడి
– ఒక్కొక్కరూ అప్రూవర్లుగా మారుతున్న వైనం
– 35 రోజులుగా ఈడీ, సీబీఐ అదుపులోనే ఉన్న కవిత
– శరత్ చంద్రారెడ్డి నుంచి రూ.14 కోట్లు తీసుకున్నారని అభియోగాలు
– 5 రిటైల్ జోన్లకు 25 కోట్ల డిమాండ్
– ఇక బయటకు రావడం కష్టమేనా?

Kavitha Liquor Case Sharath Chandra Reddy :లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కున్న కవితకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. గత నెల మార్చి 15న అరెస్ట్ అవ్వగా 35 రోజులైనా బెయిల్ లభించలేదు. ఈడీ ఆధారాలు బలంగా ఉండటం వలనే కవితకు బెయిల్ రాలేదని తెలుస్తోంది. ముందు నుంచి ఈ కేసులో కవితే కీలక సూత్రధారి అంటూ వాదిస్తోంది ఈడీ. ఇప్పుడు కవితకు మరో చిక్కు వచ్చి పడింది. తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారాడు. ఈ మేరకు సీఆర్పీసీ 164 ప్రకారం జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో ఈడీ కేసులోనూ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారాడు. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో రిమాండ్‌లో ఉండగా, ఇప్పుడు శరత్ చెప్పే కీలక సాక్ష్యాలు కవిత మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.

రూ.14 కోట్ల గుట్టంతా ఇదే!

లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవిత పాత్ర కీలకం అని కోర్టుకు తెలియజేసింది సీబీఐ. ఆమె రూ.100 కోట్లు చెల్లించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు తెలిపింది. డబ్బుల కోసం శరత్‌ని కవిత బెదిరించారని సీబీఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారని వివరించింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ.14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ అంటోంది. మహబూబ్ నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ.14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని చెబుతోంది. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను రూ.14 కోట్లు ఇవ్వలేనని శరత్ చంద్రారెడ్డి చెప్పారట. కానీ, రూ.14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ తన కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. అరబిందో ఫార్మా కంపెనీ యజమానుల్లో శరత్ ఒకరు. ఔరో రియాలిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఏపీలో కాకినాడ పోర్టును ఈ సంస్థ దక్కించుకుంది.

శరత్ చంద్రారెడ్డి చెప్పిన కీలకాంశాలివే!

ఒక్కో రిటైల్ జోన్‌కి రూ.5 కోట్ల చెప్పున 5 రిటైల్ జోన్‌లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నుంచి కూడా రూ.50 కోట్లు డిమాండ్ చేశారు. ఆయన తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు రూ.25 కోట్లు చెల్లించారని సీబీఐ చెబుతోంది. మాగుంట రాఘవ కూడా అప్రూవర్ అయ్యారు. ఇండో స్పిరిట్‌లో 65 శాతం వాటా కవిత పొందారని సీబీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలో స్వయంగా నిందితులు అప్రూవర్లుగా మారి.. బెదిరిస్తేనే డబ్బులు ఇచ్చామని చెప్తుండడంతో కవితకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పుడు ఒక్కొక్కరూ అప్రూవర్లుగా మారిపోయి అసలు నిజాలు చెబితే కవిత బయటకు రావడం కష్టమేననే చర్చ జరుగుతోంది.

Just In

01

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి.. ఎమోషన్ అయిన దర్శకుడు..