బెంగళూరు, స్వేచ్ఛ: Honey Trap Case: హనీ ట్రాప్ వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. మంత్రులు సహా రాజకీయ ప్రముఖులే లక్ష్యంగా హనీట్రాప్ జరిగిందని, రాష్ట్రానికి చెందిన 48 మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకొని బాధితులుగా మారారని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి దారితీశాయి. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలంటూ ప్రతిపక్ష బీజేపీ శుక్రవారం అసెంబ్లీలో పట్టుబట్టింది.
హనీ ట్రాప్ వ్యవహారాన్ని పక్కనపెట్టి గవర్నమెంట్ ముస్లిం కోటా బిల్లును ఆమోదింపజేసుకోవడాన్ని ఆక్షేపించారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసనలు, నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల నినాదాలతో సభ దద్దరిల్లింది. కొద్దిసేపు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర ఆగ్రహానికి గురైన స్పీకర్ ఏకంగా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు చేశారు. 6 నెలల పాటు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాల్, లాబీ, గ్యాలరీలోకి రాకూడదని స్పష్టం చేశారు.
సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా సభ నుంచి బయటకు తరలించారు. చేతులతో ఎత్తుకొని బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా హనీట్రాప్‌పై రాజకీయ నాయకులు చిక్కుకున్నారని వ్యాఖ్యానించిన మంత్రి రాజన్న, నేతలకు సంబంధించిన అసభ్యకర వీడియోలు సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో ఉన్నాయని పేర్కొన్నారు.
Also read: Online Gaming Gang Arrested: బెట్టింగ్ లో తొలి వికెట్.. సట్టా గ్యాంగ్ అరెస్ట్
హనీట్రాప్ ఏ ఒక్క పార్టీకో పరిమితమైన కాదని, అధికార, విపక్షాలకు చెందినవారు ఉన్నారని పేర్కొన్నారు. మరో మంత్రి సతీశ్ జార్కిహోళీ కూడా ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్ ప్రయత్నం జరిగిన మాట నిజమేనని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాలు రాష్ట్రానికి కొత్త కాదని, వీటిని కొందరు రాజకీయ స్వార్థప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని అన్నారు. మంత్రులు చేసిన ఈ వ్యాఖ్యలను విపక్ష బీజేపీ అస్త్రంగా మార్చుకుంది.
Also read: Miss World 2025: ప్రపంచ అందాలన్నీ తెలంగాణ వైపు.. మే 31న మిస్ వరల్డ్ ఫైనల్ పోటీ..
ఎవర్నీ వదలబోం: సీఎం సిద్ధరామయ్య
హనీ ట్రాప్ వ్యవహారంపై సభలో బీజేపీ ఎమ్మెల్యేలు సృష్టించిన రచ్చపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసు నమోదై, హనీట్రాప్ వ్యవహారంలో ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదని, చట్టప్రకారం దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని హోంమంత్రి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.