Telangana BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలతో కాషాయ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఈ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని బీజేపీ మూటగట్టుకుంది. ఈ బైపోల్ లో గెలుపు ధీమాతో ఉన్న కమల దళం తీవ్రస్థాయిలో చతికిలపడింది. కనీసం డిపాజిట్ కూడా కమలం పార్టీకి దక్కలేదు. గతంలో వచ్చిన ఓట్ల కంటే ఈసారి భారీగా ఓట్లు తగ్గాయి. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు దక్కించుకున్నారు. ఆ సమయంలో 14.11 శాతం ఓట్లను పార్టీ దక్కించుకుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ లంకల దీపక్ రెడ్డికే టికెట్ కేటాయించింది. కాగా ఈసారి ఆయన కేవలం 17,061 ఓట్లకే లంకల దీపక్ రెడ్డి పరిమితం కావాల్సి వచ్చింది. కేవలం 8.76 శాతం ఓట్లే దక్కించుకోవడం గమనార్హం. గతంలో వచ్చిన ఓట్లు కూడా దక్కకపోవడంతో కాషాయ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. ఈ ఫలితల ఎఫెక్ట్ భవిష్యత్ ఎన్నికలపై పడే అవకాశముందని ఆందోళనతో ఉన్నారు.
Also Read: Telangana BJP: పోల్ మేనేజ్‌మెంట్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్.. వర్కౌట్ అయ్యేనా..!
అభ్యర్థి ప్రకటనలో జాప్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఇతర పార్టీలతో పోలిస్తే అన్ని అంశాల్లో వెనుకంజలోనే ఉంది. అభ్యర్థి ప్రకటన నుంచి మొదలు ప్రచార శైలి, పోల్ మేనేజ్ మెంట్ వరకు ప్రతీ అంశాల్లో వెనుకబడింది. ఆ తప్పిదాల వల్లే కనీసం గతంలో వచ్చిన ఓట్లు కూడా రాకుండా కారణమయ్యాయని చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎంపికలోనూ కాషాయ పార్టీ తప్పటడుగు వేసిందనే విమర్శలు వచ్చాయి. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే కనీసం ప్రత్యర్థి పార్టీలతో పోటీలో అయినా ఉండేదనే చర్చ జరుగుతోంది. అభ్యర్థిగా జూటూరి కీర్తిరెడ్డితో పటు పలువురి పేర్లను పరిశీలించిన పార్టీ ఫైనల్ గా లంకలకు ఇవ్వడం మైనస్ అయిందని చెబుతున్నారు. అభ్యర్థి ప్రకటనకు రెండు మూడ్రోజుల ముందు బొంతు రామ్మోహన్ ను చేర్చుకుని టికెట్ ఇవ్వాలని ఎంపీ అర్వింద్ ప్రతిపాదించారు. కానీ దీన్ని పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన కూడా ఈ ఎలక్షన్ ను లైట్ తీసుకున్నట్లు సమాచారం. ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారానికి వచ్చినా ఆయన మాత్రం అడుగు కూడా పెట్టేలేదు.
ప్రచారంలోనూ నిదానమే..
ఈ ఉప ఎన్నికలను చాలెంజ్ గా తీసుకుని తమ సత్తా ఏంటో చాటాల్సిన కమలం పార్టీ ప్రచారంలోనూ చేతులెత్తేసిందనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పోలిస్తే అనుకున్న మేర ప్రచారం నిర్వహించకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. కార్పెట్ బాంబింగ్ పేరిట సెగ్మెంట్ మొత్తం ఒకేరోజు 50కి పైగా సమావేశాలు, సభలు నిర్వహించినా ఎలాంటి ఫలితం కమలం పార్టీకి దక్కలేదు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్న పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రల ముఖ్యమంత్రులు అనుకున్న స్థాయిలో ఎవరూ రాలేదు. అంతా బీహార్ ఎన్నికల్లోనే నిమగ్నమయ్యారు. ఆ ఎలక్షన్ కాషాయ పార్టీకి కీలకం కావడంతో ఈ బైపోల్ ను హైకమాండ్ కూడా లైట్ తీసుకుంది. ఇక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ప్రచారంలో పాల్గొన్నా 17,061 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం కూడా బీజేపీకి మైనస్ అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొలతాడు ఉన్నవారికి, లేని వారికి జరుగుతున్న ఎన్నికలని చెప్పడంతో ముస్లింలంతా వన్ సైడ్ అయ్యారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ప్రచారంలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఓటిమికి కారణంగ పలువురు చెబుతున్నారు.
నవంబర్ సెంటిమెంట్ కు బ్రేక్
కాషాయ పార్టీకి నవంబర్ నెల సెంటిమెంట్ గా మారింది. గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా నవంబర్ లోనే జరిగింది. దీంతో ఈ ఎలక్షన్ లో కూడా గెలుస్తామని ఆశతో ఉన్న శ్రేణుల సెంటిమెంట్ కు ఈ ఫలితాలతో బ్రేక్ పడినట్లయింది. దుబ్బాక ఉప ఎన్నిక 2020 నవంబర్ లో జరిగింది. ఉత్కంఠ పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై రఘునందన్ రావు 1079 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు కూడా 2021 నవంబర్ లోనే వెలువడ్డాయి. బీఆర్ఎస్, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలుగా చెప్పిన రాజేందర్.. గులాబీ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 24,068 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అదే తరహాలో ఈసారి కూడా విజయతీరాలకు చేరుతామని శ్రేణులు భావించగా కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం.
ఓటమి బాధ్యత ఎవరిది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదేనని ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఆదిలోనే చేతులెత్తేసింది. బరువు, బాధ్యతలన్నీ కిషన్ రెడ్డిపైనే మోపింది. ఎందుకంటే సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ కు జరుగుతున్న బైపోల్ కావడంతో ఆయన పార్లమెంట్ లో వేలు పెట్టడమెందుకని అంతా సైలెంట్ గా ఉండిపోయారని చర్చ జరిగింది. దీనికి తోడు ఓడిపోతే ఆ భారం తమపై ఎక్కడ పడుతుందోనని ముందుగానే ఆ భారాన్ని కిషన్ రెడ్డిపై మోపి స్కిప్ అయ్యారనే టాక్ వినిపించింది. కాగా తన సెగ్మెంట్ పరిధిలోకి వస్తుండటంతో అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచారం వరకు అన్నీ తానై కిషన్ రెడ్డి చూసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి కాళ్లకు బలపం కట్టుకుని సెగ్మెంట్ అంతా విస్తృతంగా తిరిగారు. తాము కింగ్ మేకర్ కాదని, కింగ్ గా నిలుస్తామని ఆయన ధీమాతో ఉన్నారు. కానీ ఫలితాల్లో ఊహించని పరిణామంతో ఈ ఓటమి బాధ్యత ఎవరిపై ఉందనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డిపై మోపుతారా? లేక రాష్ట్ర నాయకత్వం ఖాతాలో పడుతుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది.
రాంచందర్ రావుకు ప్రెసిడెంట్ గా తొలి ఓటమి
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అందుకున్న తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక జూబ్లీహిల్స్. ఈ ఎలక్షన్ ఫలితాలు ఆయనకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి. గతంలో దుబ్బాక, హుజురాబాద్, తాజాగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలుపు వరకు ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆయన వ్యూహాలు అద్భుతంగా వర్కవుట్ అయ్యాయని పార్టీ రాంచందర్ రావుకు మంచి ప్రాధాన్యతనిచ్చింది. లక్కీ హ్యాండ్ గా బీజేపీ ఆయన్ను భావించింది. కానీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఎలక్షన్ లో పార్టీ ఓటమి పాలవ్వడంతో ఆయన వ్యూహాలు, పాచికలు పారలేదా? అనే చర్చ జరుగుతోంది. కాగా రాష్ట్ర నాయకత్వం ఈ ఓటమికి సంబంధించిన అంశాలపై పోస్ట్ మార్టం చేయనుంది. అందుకు గల కారణాలను సమీక్షించి మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని భావిస్తోంది.
ఇంపాక్ట్ చూపని జనసేన మద్దతు
ఎన్డీయే కూటమిలో జనసేన, టీడీపీ భాగస్వామ్యంగా ఉన్నాయి. ఈ ఎలక్షన్ లో ప్రచారం ముగిసే చివరి రెండు, మూడ్రోజుల ముందు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా జనసేన స్పష్టంచేసింది. కాగా టీడీపీ మాత్రం అధికారికంగా మద్దతు ప్రకటించనప్పటికీ ప్రచారంలో పసుపు జెండాలు దర్శనమిచ్చాయి. అయితే ఈ రెండు పార్టీల మద్దతు ఇచ్చినా ప్రభావం చూపకపోవడం గమనార్హం. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా పోటీచేసి 25,866 ఓట్లు దక్కించుకుంది. కానీ ఈసారి ఎన్డీయే భాగస్వాఆమ్య పార్టీల మద్దతు లభించినా కేవలం 17,061 ఓట్లకే పరిమితమవ్వడం గమనార్హం.
ఓటమిపై సొంత పార్టీ నుంచి విమర్శలు
జూబ్లీహిల్స్ ఓటమిపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బీజేపీకి ఎంతో బలమైన స్ట్రాటజీ అవసరమని అర్వింద్ వెల్లడించారు. ఇలా ఉంటే భవిష్యత్ ఎన్నికల్లో కూడా మళ్లీ అధికారం కాంగ్రెస్ దేనని విమర్శించారు. ఇదిలా ఉండగా బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేతలను చూసి నేర్చుకోవాలంటూ హితవు పలికారు. పరిస్థితి ఇలా ఉంటే 50 ఏండ్లయినా అధికారంలోకి రాలేరని స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలపై లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను ఆయన సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు.
భవిష్యత్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం
తెలంగాణలో భవిష్యత్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. గెలిచి సత్తా చాటితే శ్రేణులకు మరింత బూస్ట్ దక్కి ఉత్సాహంగా పనిచేసేందుకు ఆస్కారముండేది. కానీ బీజేపీ అనుకున్నదొక్కటయితే.. అయినది మరోటి అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ ఓటమి బాధను బీహార్ ఎన్నికల గెలుపుతో రాష్ట్ర నాయకత్వం కవర్ చేసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యే ఉంటుందని రాష్ట్ర నాయకత్వం పలుమార్లు చెప్పింది. కానీ అందుకు విరుద్ధంగా ఫలితాలు రావడంతో చివరకు కంగు తినాల్సి వచ్చింది. అసలు కమలం పార్టీ కనుచూపు మేరల్లో కూడా లేకపోవడం గమనార్హం. భవిష్యత్ ఎన్నికల్లో అయినా కమలం పార్టీ ఈ ఓటమి గుణపాఠంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందా? లేద? అనేది చూడాలి.
Also Read: Telangana BJP: కమలం పార్టీలో కనపడని జోష్.. జూబ్లీహిల్స్ ఓటర్లు కరుణిస్తారా?
