irrigation minister uttam kumar reddy visits kaleshwaram project slams brs govt | Minister Uttam Kumar Reddy: కాళేశ్వరం.. తెలంగాణ ప్రజలపై భారం
uttam kumar reddy
Political News

Minister Uttam Kumar Reddy: కాళేశ్వరం.. తెలంగాణ ప్రజలపై భారం

– తెచ్చిన అప్పులకు భారీగా వడ్డీలు
– గత ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ కుంగుబాటు
– అన్నారం, మేడిగడ్డ మరమ్మతు పనులు సంతృప్తికరం
– సుందిళ్లలో పనుల జాప్యంపై సంస్థను హెచ్చరించాం
– బ్యారేజీలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Kaleshwaram Project: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుంగిపోయిందని అన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు. అప్పటి ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఇంత ముప్పు జరిగేది కాదని వివరించారు. వెంటనే, గేట్లు ఎత్తితే ఇంత నష్టం వాటిల్లేది కాదని నిపుణుల కమిటీ తేల్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే వారం రోజుల్లోనే బ్యారేజీలను ఎన్‌డీఎస్ఏకు అప్పగించామని గుర్తు చేశారు. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ మధ్యంతర సూచనలు చేసిందని మంత్రి తెలిపారు. మూడు బ్యారేజీల గేట్లు ఎత్తాలని నిపుణుల కమిటీ చెప్పినట్టు వివరించారు. మరమ్మతులు చేసినా నీళ్లు స్టోర్ చేయవద్దని హెచ్చరించినట్టు పేర్కొన్నారు.

ఎన్‌డీఎస్ఏ మధ్యంతర నివేదిక మేరకు మరమ్మతు పనులు ప్రారంభించామని వివరించారు. ఈ పనుల పురోగతిని పరిశీలించడానికే తాను పర్యటన చేసినట్టు చెప్పారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలలో జరుగుతున్న పనులు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. సుందిళ్ల పనులు జాప్యం అవుతున్నాయని, అందుకే నవయుగ సంస్థను హెచ్చరించినట్టు వివరించారు. ఇక మరమ్మతు పనుల ఖర్చులను నిర్మాణ సంస్థలే భరిస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజలపై భారం మోపిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.94 వేల కోట్లు అప్పు తెచ్చారని తెలిపారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడమే ఇప్పుడు భారంగా మారిందని చెప్పారు. తెలంగాణ ప్రజలపై ఎంతటి భారం వేశారో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చని సెటైర్లు వేశారు.

వరదకు అడ్డంకి లేకుండా చూస్తున్నాం: ఈఎన్సీ

జీఆర్టీ, ఈఆర్టీ పరీక్షలు చేస్తున్నామని ఈఎన్సీ అనిల్ కుమార్ తెలిపారు. అన్ని గేట్లు ఎత్తి వరదకు అడ్డంకి లేకుండా చూస్తున్నామని వివరించారు. కన్నేపల్లి పంపు హౌజ్ వద్ద వరదల చివరి దశలో నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నదని చెప్పారు. జియో ట్యూబ్ ద్వారా కన్నేపల్లి పంపు హైజ్‌కు నీళ్లు మళ్లిస్తామని వివరించారు. అన్నారం వద్ద 12 మీటర్లు, సుందిళ్ల వద్ద 11 మీటర్ల వరద లెవెల్ ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..