NEET Exam: వైద్య విద్యలోకి ప్రవేశాన్ని కల్పించే నీట్ పరీక్ష నిర్వహణలో చాలా అవకతవకలు జరిగాయని, లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నీట్ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష విషయమై అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ఎన్డీయే సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష, తెలంగాణ జాబ్ క్యాలెండర్, ఇతర అంశాలపై మాట్లాడారు. నీట్ పరీక్ష నిర్వహణంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నెలరోజులపాటు దరఖాస్తులకు అనుమతించిన కేంద్రం.. వారం రోజులు అదనంగా గడువు పెంచిందని గుర్తు చేశారు. జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉండగా.. 4వ తేదీనే రిజల్ట్ వెలువడటంపైనా అనుమానాలు వచ్చాయని వివరించారు. అసలు పరీక్షలు జరగడానికి ముందే కొన్ని ఘటనలు కలకలం రేపాయని, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయని తెలిపారు.
63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంక్ రావడం ఈ అనుమానాలను మరింత పెంచాయని, గ్రేస్ మార్కుల విషయం కూడా ఆందోళనలకు కారణమైందని మంత్రి వివరించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పై విద్యార్థులకు మళ్లీ నమ్మకం కలిగేలా కేంద్రం వ్యవహరించాలని సూచించారు.
ఇక బొగ్గు గనుల విషయంపై మంత్రి దుద్దిళ్ల మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తున్న సంస్థ అని వివరించారు. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలని తెలిపారు. కానీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నట్టు చెప్పారు. ఒ వైపు సింగరేణిని ప్రైవేటు పరం చేయబోమని చెబుతూనే మరోవైపు ప్రైవేటు వ్యక్తులకు గనులను కట్టబెట్టే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని తెలిపారు. కాబట్టి, ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరాలోచన చేయాలని సూచించారు. ఈ అంవంపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడుతారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను పునరాలోచించుకోవాలని, లేదంటే.. ఆ పార్టీకి భవిష్యత్‌లో ఒక్క సీటు కూడా రాదని మంత్రి తెలిపారు. శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగానే ఉన్నదని వివరించారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా సహించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పాలన ఉంటుందని, బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తాము తీసుకోమని చెప్పారు.