Uttam Kumar Reddy: గత బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జలాలలో తెలంగాణ కు తీవ్ర అన్యాయం జరిగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు కృష్ణా జలాల వాటా 811 టీఎంసీ లు కేటాయిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కి 512 టీఎంసీ లిఖితపూర్వకంగా కేటాయించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోగా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షకోట్ల రూపాయలు కేటాయించి నిధులను దుర్వినియోగం చేసిందని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, కూలిపోవడం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని స్పష్టం చేశారు.
దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయాంలో చేవెళ్ల ప్రాజెక్టుకు 38 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే వాటి డిజైన్ మార్చి మేడిగడ్డ వద్ద లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం నిర్మించి 62 వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు.
Also read: Komatireddy Venkat Reddy: కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ.. రాజకీయం తెలీదు.. కోమటిరెడ్డి సెటైర్లు
తెలంగాణకు కృష్ణా జలాలలో 70 శాతం వాటా రావలసి ఉండేది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణ జలాల మీటింగ్ కు నేనే స్వయంగా హాజరై బ్రిటీష్ ట్రిబ్యునల్ కేటాయింపులను కేంద్ర మంత్రికి వివరించడం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. హుజూర్ నగర్ మండలం మేళ్ల చెరువులో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్.. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపథ్యంలో వాతావరణ సూచన మేరకు అప్రమత్తమైన పైలట్.. సూర్యాపేట జిల్లా కోదాడలో అత్యవసరంగా హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. దీంతో కోదాడ నుండి హుజూర్ నగర్ వరకు 16 కిలోమీటర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్డు మార్గంలో వెళ్లారు.