Summer Heat: ఒక వైపు చల్లటి కబురు అంటూ నైరుతి రుతుపవనాలు ఊరిస్తున్నాయి. రుతుపవనాలు దేశంలోకి వచ్చేశాయన్న కూల్ న్యూస్ తప్పితే ఇక్కడ తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్ సీజన్ వెళ్లిపోయే ముందు ఓ చూపు చూద్దామన్నట్టుగా సూర్యుడు రెచ్చిపోతున్నాడు. రాష్ట్రంలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు రికార్డు అవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో మంచిర్యాలలోని భీమారం, పెద్దపల్లిలోని కమాన్‌పూర్‌లో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గరిమెల్లపాడులో, మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ 46.9 డిగ్రీలు నమోదయ్యాయి.
నల్లగొండలోని కేతెపల్లిలో 46.8 డిగ్రీలు, ఖమ్మంలోని పీఎస్ ఖానాపూర్‌లో 46.8 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలోని పాత మంచిర్యాలలో 46.7 డిగ్రీలు, ఖమ్మంలోని కారెపల్లి గేట్‌లో 46.6 డిగ్రీలు, పెద్దపల్లిలోని ముత్తారంలో 46.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌లో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం కూడా రాష్ట్రంలో ఎండలు ఠారెత్తించాయి. గరిష్టంగా 47 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. ఒకవైపు వర్షాకాలం సమీపిస్తుండగా.. మరో వైపు ఎండలు పీక్స్‌లో పడుతున్నాయి.
నైరుతి రుతుపవనాలు ఇది వరకే కేరళ తీరాన్ని తాకాయి. తమిళనాడులో వ్యాపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే జూన్ 5వ తేదీ నాటికి తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలుస్తున్నది. రుతుపవనాలు ఆవరించే కొద్దీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.