– ఎమ్మెల్యే పల్లా, బీఆర్ఎస్ నేత రాకేశ్ అరెస్టు
– కొద్దిసేపు మీడియాకు నో ఎంట్రీ
– మోతీలాల్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పరామర్శ
Opposition: నిరుద్యోగుల సమస్యలపై ఉస్మానియా విద్యార్థి మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న గాంధీ హాస్పిటల్ వద్ద సోమవారం హైడ్రామా ఏర్పడింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు గాంధీ హాస్పిటల్ రావడంతో కొద్దిసేపు టెన్షన్ నెలకొంది. ఉద్రిక్తతల సమయంలో మీడియాను కూడా కవరేజ్ కోసం పోలీసులు హాస్పిటల్ లోనికి అనుమతించలేదు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సోమవారం గాంధీ హాస్పిటల్ వెళ్లి మోతీలాల్ నాయక్‌ను పరామర్శించారు. మోతీలాల్ నాయక్ ఆవేదనను, సమస్యలను తెలుసుకుని సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయడానికి తాను అక్కడికి వెళ్లినట్టు ఆ తర్వాత బల్మూరి వెంకట్ వెల్లడించారు.
మోతీలాల్ నాయక్‌ను పరామర్శించడానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి గాంధీ హాస్పిటల్ వద్దకు వచ్చారు. హాస్పిటల్ లోనికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు వెలుపలే ఉన్న మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ఎక్కించుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేశ్ రెడ్డి, బక్కా జడ్సన్ సహా పలువురిని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా, మీడియాను కూడా గాంధీ హాస్పిటల్ లోనికి అనుమతించకపోవడంపై కలకలం రేగింది.
మోతీలాల్ నాయక్‌ను పరామర్శించిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలో చెలగాటమాడిందని ఆరోపించిన బల్మూరి వెంకట్.. తమ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నదని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుందని, మెగా డీఎస్సీ ఇప్పటికే వేశామని తెలిపారు. గాంధీ హాస్పిటల్‌లో ఆమరణ దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ఆవేదన తెలుసుకుని సీఎం రేవంత్ రెడ్డికి వివరించాలనే ఉద్దేశ్యంతో తాను అక్కడికి వెళ్లినట్టు చెప్పారు. ఆనాడు రాష్ట్రంలో బోడ సునీల్, ప్రవళిక ఆత్మహత్యలు చేసుకున్నా మాట్లాడని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఫైర్ అయ్యారు. అందరికీ ఉద్యోగాలు రావని, హామాలీ పనులు చేసుకోవాలని నాటి మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రవళిక మరణంపై క్షమాపణ చెప్పిన తర్వాతే హరీశ్ రావు మాట్లాడాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు.