Rains: గత కొన్ని రోజులు సూర్యుడు నిప్పులు కక్కుతున్నట్టుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంతలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అనుకున్నదాని కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. తెలంగాణలో వాతావరణం వేగంగా చల్లబడింది. ఆదివారం సాయంత్రం పూట వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు పడగా సాయంత్రం కుండపోతగా వర్షం పడింది. రాజధాని హైదరాబాద్ నగరంలో సాయంత్రంపూట భారీగా వర్షం కురిసింది. ఇతర జిల్లాల్లోనూ సాయంత్రం వర్షం పడింది.
ఈ మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. ఆ తర్వాత కూడా తేలికపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది. ముందు జాగ్రత్తగా ఈ నెల 6వ తేదీ వరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ఎండ వేడిమి నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుందని తెలిపింది.
సోమవారం రోజున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మంగళవారం రోజున కూడా భారీ వర్షాల సూచన ఉన్నదని, ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
బుధ, గురు వారాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.