– మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత
– రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు
– పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Telangana: హైదరాబాద్‌లో సోమవారం వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా ఉండగా 3 గంటల ప్రాంతంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. కుండపోతగా వర్షం పడింది. ఈదురుగాలులు కూడా వచ్చాయి. వేగంగా వీచిన ఈ గాలులకు నగరంలోని పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. టోలీచౌకిలో 200 ఏళ్లనాటి మహావృక్షం నేలకొరిగింది.
గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్ట, లక్డీకపూల్, ఎస్ఆర్ నగర్, రాజేంద్ర నగర్, అత్తాపూర్, ఎర్రగడ్డ, యూసుఫ్ గూడ, లంగర్ హౌజ్, గండిపేట, శివరాంపల్లిలో భారీ వర్షం పడింది. అలాగే.. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, సికింద్రాబాద్, మణికొండ, షేక్‌పేట, కొండాపూర్, హైటెక్ సిటీ, అల్వాల్, బాలానగర్, బోయిన్ పల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, నాంపల్లిలోనూ భారీ వర్షమే కురిసింది. ఉన్నపళంగా ఒక్కసారిగా వర్షం పడటంతో వాహనదారులకు ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఇదిలా ఉండగా.. వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే, ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నదని చెప్పారు. కాగా, మంగళవారం కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు.