Harish Rao: అమెరికాలో మన తెలుగు పిల్లలకు బేడీలు వేసి జైల్లో పెట్టిన ట్రంప్ పేరును హైదరాబాద్ రోడ్డుకు పెడతారా? పన్నులు పెంచి, వీసాలు కఠినం చేసి భారతీయులను ఇబ్బంది పెడుతున్న ట్రంప్ పేరు పెట్టడం అంటే భారతీయులను అవమానించడమే అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు అని, నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితమే తెలంగాణ ప్రకటన అని అన్నారు. నాడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడకపోతే డిసెంబర్ 9 ప్రకటన వచ్చేది కాదని, నేడు మనం చూస్తున్న జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉండేది కాదన్నారు. కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. తెలంగాణ తల్లి ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపం అని, ప్రజలు స్వచ్ఛందంగా ఊరూరా, వాడవాడలా విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్న తల్లిని మార్చాలనుకోవడం దుర్మార్గం అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసింది శూన్యం
ఎరువుల కొరత, విత్తనాల ధరల పెంపు, కరెంటు కోతలు, రైతుబంధు, రైతు బీమా ఎగ్గొట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేంటని హరీశ్ రావు ప్రశ్నించారు. మన పిల్లల ఉద్యోగాలు ఊడగొడుతున్న వ్యక్తికి నీరాజనాలు పడతారా అని ప్రశ్నించారు. పదవులే కాదు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆయన ఉద్యమంలో ఆమరణ దీక్ష, పోరాటం వల్ల వారి ఆయుష్షు పది సంవత్సరాలు తగ్గిందన్నారు. దేవుడి దయ, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేధించారన్నారు. తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుకబడేయబడ్డదని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పేవారని గుర్తు చేశారు. కేసీఆర్ పోరాటంతో తెలంగాణ రావడం వల్లే నేడు 24 గంటల కరెంట్, ఇంటింటికి నీళ్లు, కోటి ఎకరాల మాగాణి సాధ్యమైందన్నారు. తలసరి ఆదాయంలో, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని వెల్లడించారు. కానీ, నేడు తెలంగాణను మళ్లీ వెనుకబడేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. సమైక్యవాదుల బాటలో నడుస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Also Read: Yash Toxic: యష్ ‘టాక్సిక్’ విడుదలకు ఇంకా ఎన్ని రోజులంటే.. పోస్టర్ వైరల్

