Krishna Water Dispute: సాగర్ నీటిని ఏపీ అక్రమంగా తరలించుకుపోతుంటే కేంద్రంమంత్రిగా ఉండి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఏం చేస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) నిలదీశారు. మీకు(కిషన్ రెడ్డికి) బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఏపీ చేస్తున్న జలదోపిడీ కనబడటం లేదా అని మండిపడ్డారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ అక్రమంగా కృష్ణా నీళ్లను తరలించుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో మొద్దు నిద్ర నటిస్తున్నదని మండిపడ్డారు. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం రోజు 10వేల క్యూసెక్కుల నీళ్లు తరలించుకుపోతుంటే, తెలంగాణ ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తుందన్నారు. నీళ్ల మంత్రి ఉత్తమ్ నీళ్లు నములుతున్నారని మండిపడ్డారు.
మూడు నెలలుగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటుంటే ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి బెల్లం గొట్టిన రాళ్లలాగా చలనం లేకుండా ఉన్నారని ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటి వరకు 657 టీఎంసీలు తరలిస్తే మీ నోరు పెగలదా? మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? అని ప్రశ్నించారు. గడిచిన 25 రోజుల్లోనే 60 టిఎంసీలు తరలించారన్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్, తెలంగాణ ప్రజల పాలిట పెను శాపంగా మారిందన్నారు. సీఆర్పీఎఫ్ బలగాల చేతిలో ఉన్న ప్రాజెక్టు నుంచి ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లు తరలిస్తున్నదని హరీష్ రావు అన్నారు. అయినా సీఎంకు చంద్రబాబును అడిగే ధైర్యం లేదు. కేంద్రాన్ని అడిగే దమ్ము లేదని మండిపడ్డారు.
తెలంగాణ సాగు నీటి, తాగు నీటి అవసరాలకు నిల్వ ఉంచాల్సిన నీటిని ఏపీ తరలిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణగా నీరు ఇస్తూ సహరిస్తున్నారన్నారు. నీటిని అడ్డుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, హైద్రాబాద్ డ్రింకింగ్ వాటర్ నాగార్జున సాగర్ పై ఆధారపడి ఉందని, ఇప్పటికైనా కండ్లు తెరవండి అని సూచించారు. రైతుల పంటలు కాపాడాలంటే తక్షణం కేంద్రం మీద ఒత్తిడి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ జలదోపిడీని తక్షణం అడ్డుకోవాలన్నారు. ఈ ఏడాది ఇంతవరకు త్రిమెన్ కమిటీ మిటింగ్ పెట్టలేదు. అంటే బోర్డు వ్యవహారం ఎంతగా దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.
కేఆర్ఎంబీ ఆఫీసు ఎదుట ధర్నా చేద్దాం పదండి, పోదాం పదా కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం, ప్రధాని ఇంటి ఎదుట ధర్నా చేద్దాం అని పిలుపునిచ్చారు. మీకు చేతగాకుంటే మీ వెంట మేమూ కలిసి వస్తామని అన్నారు. ఢిల్లీకి సీఎం అఖిల పక్షాన్ని తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని గెలిపించింది పంటలు ఎండగొట్టడానికా, తాగు నీటి కోసం ప్రజలు గోస పడడానికా అని నిలదీశారు. తక్షణమే సాగర్ కుడి కాల్వకు నీళ్లు విడుదల ఆపాలి, ముచ్చుమర్రి నుంచి తోడుతున్న నీళ్లను, పోతిరెడ్డి పాడు ద్వారా తరలిస్తున్న నీటిని ఆపాలని డిమాండ్ చేశారు. బోర్డు కేంద్రం కంట్రోల్‌లో ఉందా, ఏపీ కంట్రోల్‌లో ఉందా అనే అనుమానం వస్తున్నదన్నారు.