Harish Rao: నైనీ గోల్డ్ బ్లాక్ టెండర్‌తో పాటు అవినీతి జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో ఖరారైన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లు అన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. నైనీ బొగ్గు గనిలో అక్రమాలు జరిగాయని బయటపెట్టినా కూడా స్కాం జరగలేదని భట్టి విక్రమార్క బుకాయించడం శోచనీయమని అన్నారు. ఒక్క నైనీ కోల్డ్ బ్లాక్ టెండర్ రద్దు చేయడమే కాదు, సైట్ విజిట్ సర్టిఫికెట్‌తో ఖరారైన టెండర్లన్నీ రద్దు చేయాలని చెప్పారు. ఇప్పటికే కొన్ని అవార్డ్ అయిన టెండర్లు ఉన్నాయని, మరికొన్ని టెండర్ ప్రక్రియ తొలి దశలో ఉన్నాయని, ఇంకొన్ని టెండర్ దాఖలు చేసే దశలో ఉన్నాయని వివరించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది లోపభూయిష్టమైనదని చెప్పారు. ఇందులో అవినీతి జరుగుతున్నదని స్పష్టంగా ప్రజలకు అర్థమైందన్నారు. మీకు నిజాయితీ ఉంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, మిగతా అన్ని టెండర్లను క్యాన్సిల్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.
Also Read: Harish Rao: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు మరో లేఖ
శ్వేతపత్రం విడుదల చేయాలి
2025 మే తర్వాత పిలిచిన టెండర్లలో చాలా మంది కాంట్రాక్టర్లు సైట్ విజిట్ చేశారని హరీశ్ రావు చెప్పారు. లేఖలు ఇచ్చారు, అధికారిక ఈ మెయిల్స్ పంపారు, ఫోటోలు కూడా జతచేశారని తెలిపారు. అయినా వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదని, టెండర్ చివరి గంట వరకు కాంట్రాక్టర్లను వేచి చూసేలా చేసి, కేవలం రెండు మూడు సంస్థలకు మాత్రమే పాత తేదీలతో బ్యాక్‌డేటెడ్ సర్టిఫికెట్లు జారీ చేశారని ఆరోపించారు. టెండర్ డాక్యుమెంట్‌లో సైట్ విజిట్ చేసిన వెంటనే స్థానిక జీఎం సర్టిఫికెట్ ఇవ్వాలని స్పష్టంగా ఉన్నదన్నారు. మరి, సైట్ విజిట్ చేసినప్పటికీ ఎందుకు ఇవ్వలేదని, ఈ ఆలస్యం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి, ఏ చీకటి ఒప్పందం ఉన్నదని ప్రశ్నించారు. 2025 మే నుంచి ఇప్పటివరకు ఎందరు కాంట్రాక్టర్లు సైట్లు సందర్శించారు, ఎన్ని ఈ మెయిల్స్, లేఖలు వచ్చాయి, ఎన్ని సర్టిఫికెట్లు జారీ అయ్యాయి, మిగిలిన వాటిని ఎందుకు కారణం చెప్పకుండా తిరస్కరించారు అనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డులో కొర్రీలు పెట్టి వారసత్వ ఉద్యోగాలను నిర్వీర్యం చేస్తున్నారని, సింగరేణి కార్మికులకు యశోద, కిమ్స్ వంటి ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం బంద్ చేశారని ఆరోపించారు. నిమ్స్, ఉస్మానియాకు పొమ్మంటున్నారని, సింగరేణి గడించిన మొత్తం లాభం రూ.6,394 కోట్లు అయితే, కేవలం రూ.2,360 కోట్లు మాత్రమే చూపించారని అన్నారు. మిగతా డబ్బు ఏమైందని ప్రశ్నించారు.
సిరుల గనిని కాపాడుకుంటాం
రెండేళ్లలో సింగరేణి అభివృద్ధి కోసం పక్కన పెట్టిన రూ.6,000 కోట్లు ఏమయ్యాయని హరీశ్ రావు నిలదీశారు. ఆ స్కాంను కూడా త్వరలో బయటపెడతామని తెలిపారు. ‘‘సింగరేణిలో 51% వాటా రాష్ట్రానిది, 49% వాటా కేంద్రానిది. ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది?బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాలా తీయించి, ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తున్నాయి. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో ఖరారైన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలి. నైనీ కోల్డ్ బ్లాక్ టెండర్‌తో పాటు, అవినీతి జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరిపించాలి’’ అని డిమాండ్ చేశారు. వెంటనే ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్నారు. లేదంటే వేల మంది కార్మికులతో సింగరేణి భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరాకరించిన కంపెనీల మెయిల్స్, ఫిర్యాదులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినిట్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భట్టి, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ మొత్తం బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాపాడే వరకు తాము వదిలిపెట్టమని, సిరుల గనిని కాపాడుకుంటామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Also Read: Harish Rao: ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ప్రశ్నిస్తూనే ఉంటాం.. సీఎంకు హరీశ్ రావు సవాల్!

