– ఒక్క నెలలో 26 హత్యలా?
– ఎంపీ అసద్ ఏం చేస్తున్నారు?
– పోలీసులపై మజ్లిస్ నేతల ఒత్తిళ్లు
– మజ్లిస్‌కి.. సీఎం భయపడుతున్నారా?
– గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
Hyderabad: హత్యలకు, దోపిడీలకు హైదరాబాద్ పాతబస్తీ అడ్డాగా మారిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క జూన్ నెలలోనే 26 హత్యలు జరిగాయన్నారు. ఈ నెలలో ఒక్క రోజే 5 హత్యలు జరగటాన్ని బట్టి శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో అర్థమవుతోందని మండిపడ్డారు.
మజ్లిస్ పెత్తనం
హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు ప్రభుత్వ ఆదేశాలను పాటించటం లేదని రాజాసింగ్ ఆరోపించారు. మిగతా నగరంలో రాత్రి 11 కాగానే దుకాణాలు మూయించే పోలీసులు.. తమ ప్రాంతంలో తెల్లవారుజామున వరకు ఎలా అనుమతిస్తున్నారని నిలదీశారు. ఎంఐఎం నేతల ఒత్తిళ్ల మేరకే పోలీసులు విధులు నిర్వహించాల్సి వస్తోందని, మజ్లిస్ నేతలు పాతబస్తీని తమ అడ్డాగా మార్చుకుని దోచుకుంటున్నారన్నారు. హింస కారణంగా నష్టపోతున్నది ముస్లింలేననీ, హింసను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటుంటే ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు కలగజేసుకుంటున్నారని నిలదీశారు.
ఆసద్ పెత్తనమా?
అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నా, ఆయన వీటిని ఆపేందుకు చేసిందేమీ లేదని రాజాసింగ్ విమర్శించారు. పోలీసులు ప్రభుత్వ ఆదేశాలకు బదులు అసదుద్దీన్ ఆదేశాలు పాటిస్తున్నట్లు కనిపిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు ముఖ్యమంత్రి కూడా భయపడుతున్నట్లు కనిపిస్తోందని, ఇకనైనా సీఎం చొరవ తీసుకుని, అరాచక శక్తులను అణిచివేయాలన్నారు. పాతబస్తీతో బాటు బాలాపూర్, శాలిబండ, బేగంపేట, మల్లేపల్లి, అసిఫ్ నగర్, కాలాపత్తర్, కాచిగూడ, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో దోపిడీ జరుగుతోందన్నారు. మేడ్చల్‌లో తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ పక్కనే దోపిడీ, మర్డర్ జరిగాయనీ, ఇంత భయంలేకుండా నేరస్తులు చెలరేగిపోతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏంచేస్తున్నాయని నిలదీశారు.