MLA Raja Singh తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని, ఏం పీక్కుంటారో పీక్కోండని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ఘాటుగా స్పందించారు. గోషామహల్ లోని తన స్వగృహంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను గెలిచింది గోషామహల్ ప్రజల ఓట్లతో అని స్పష్టంచేశారు. దమ్ముంటే.. కిషన్ రెడ్డిని రాజీనామా చేయమనాలని, అప్పుడు తాను కూడా చేస్తానని, తిరిగి పోటీ చేస్తే ఎవరు గెలుస్తారో చూద్దామంటూ వ్యాఖ్యానించారు. తాను బీజేపీలో ఉన్నా.., లేకున్నా.. కార్యకర్తల గొంతుగా మాత్రమే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. తనను టార్గెట్ చేస్తూ బీజేపీ స్టేట్ ఆఫీసులో తన మిత్రులు ప్రెస్ మీట్ పెట్టించారన్నారు. పార్టీలో కొన్ని తప్పులు జరిగాయని తాను రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారి కోసం మాత్రమే తాను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. అలా ప్రశ్నించినందుకు ఢిల్లీ వరకు పిలిచి మాట్లాడుతున్నారన్నారు.
Also Read: Asia Cup 2025: భారత్ – పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
రూరల్ నాయకులకు చోటు కల్పించరా?
నూతన కమిటీలో దాదాపు 10 నుంచి 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్ కు చెందిన వారే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కమిటీలో రూరల్ నాయకులకు చోటు కల్పించరా? అని ప్రశ్నించారు. జిల్లాలో మంచి నేతలను చూసి వారికి అవకాశం ఇవ్వాలని తాను గతంలో ఉన్నప్పుడే సూచించానని, కానీ అలా జరగలేదన్నారు. ఇది రాంచందర్ రావు వేసిన కమిటీయా? లేక కిషన్ రెడ్డి వేసిన కమిటీయా? అనేది వారే చెప్పాలన్నారు. ఈ కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? అని ఆయన ఎద్దేవాచేశారు. ఇదే కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బీజేపీని డమ్మీ చేయడానికి కుట్రలు చేస్తున్నారని కార్యకర్తలు చాలా మంది తనకు ఫోన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
కొత్త కమిటీతో సంతృప్తిగా ఉన్నారా? లేదా?
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొత్త కమిటీతో సంతృప్తిగా ఉన్నారా? లేదా? అనేది ఆఫ్ ది రికార్డ్ లో అయినా తెలుసుకోండని సూచించారు. తాము పంపిన పేర్లు పక్కన పెట్టి, సొంత వారికే పదవులు ఇస్తున్నారని విమర్శలు చేశారు. రాంచందర్ రావు చాలా మంచి మనిషి అని, కానీ ఆయన్ను రబ్బర్ స్టాంప్ గా చేశారంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తనపై ఎవరైనా మాట్లాడితే తన స్టైల్ లో జవాబు ఇవ్వాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గతంలో తనపై ఒక మహిళతో విమర్శలు చేయించారని, ఒక మహిళపై తిరిగి విమర్శలు చేస్తే బాగుండదని ఆగిపోయానని ఆయన పేర్కొన్నారు. ఆ మహిళ చేతిలో సోషల్ మీడియా ఉందని, అన్నింటినీ మనీతో మేనేజ్ చేస్తోందని విమర్శలు చేవారు.
తనపై మాట్లాడితే ఆయనకే నష్టం
తాజాగా ఇప్పుడు జనరల్ సెక్రటరీ గా నియామకమైన అశోక్ అనే వ్యక్తి తనపై విమర్శలు చేశారని, ఆయన తనపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉండేదని సూచించారు. అశోక్.. బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి ఎంతోమంది వద్ద డబ్బులు దండుకున్నాడనే విషయాన్ని ఆయన వెనుక ఉన్నవారే స్వయంగా తనకు కాల్ చేసి చెప్పారని పేర్కొన్నారు. రాంచందర్ రావు ఇంటి ఎదుట భార్యాభర్తలిద్దరూ పదవి కోసం పెట్రోల్ పోసుకున్నారని, మొత్తానికి ఆయనకు పార్టీ పదవి దక్కిందన్నారు. ఆయనకు వచ్చిన పోస్టును కాపాడుకోవాలని, అంతేకానీ తనపై మాట్లాడితే ఆయనకే నష్టమని హెచ్చరించారు.
బీజేపీని నాశనం చేయాలని చూస్తున్నారు
తాను ఒక ఫైటర్ ను అని, అవసరమైతే రోడ్డుపై, మీడియాలో కూడా కొట్లాడుతానన్నారు. అధికారంలోకి రావడానికి తాను కొట్లాడుతున్నట్లు చెప్పారు. కానీ కొందరు మాత్రం బీజేపీని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. రాంచందర్ రావుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని, ఆయన్ను తనపని చేసుకొనివ్వండంటూ సూచించారు. రాజాసింగ్ ఏక్ నిరంజన్ అని, సిటీలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే అయినా పార్టీలో రెస్పెక్ట్ లేదన్నారు. తాను ఎవరిపై విమర్శలు చేయడంలేదని, సరిచేసుకోండని మాత్రమే చెబుతున్నానంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తనకు యూపీ సీఎం యోగితో పాటు చాలామంది పార్టీ పెద్దల ఆశీర్వాదం ఉందని తెలిపారు. వారికి చెప్పకుండా రాజీనామా చేసినందుకు తిట్టారని వ్యాఖ్యానించారు.
తమను తొలగిస్తారని భయంతో ఎవరూ మాట్లాడటం లేదు
ఆ సమయంలో తన బాధను వారికి చెప్పుకున్నానని వివరించారు. పని చేసిన వారికి పోస్టులు, పదవులు ఇవ్వాలని తాను ప్రతి మీటింగ్ లో చెప్పానని, మరీ ముఖ్యంగా నల్లగొండ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాకు సైతం గ్రూప్ పాలిటిక్స్ పై వివరించానని తెలిపారు. ఇవ్వాళ కాకుంటే భవిష్యత్ లో అయినా పార్టీకి అన్యాయం చేసిన వారిపై తప్పక చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు తనకు సహకరించలేదని, తనను గెలిపించింది గోశామహల్ ప్రజలని ఆయన వ్యాఖ్యానించారు. కార్యకర్తలు.. తమను తొలగిస్తారని భయంతో ఎవరూ మాట్లాడటం లేదని, అందుకే వారి తరుపున తాను మాట్లాడుతున్నానని వివరించారు. ఇదిలా ఉండగా పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంశంపై సర్వే చేసి మరో ప్రెస్ మీట్ పెడుతానని రాజాసింగ్ వివరించారు.
Also Read: Mega Little Prince: మెగా లిటిల్ ప్రిన్స్.. రామ్ చరణ్, నిహారిక పోస్ట్‌లు వైరల్..!