– హైదరాబాద్‌లో భారీ వర్షం
– లోతట్టు ప్రాంతాలు జలమయం
– గంటపాటు నరకం చూసిన వాహనదారులు
– జీహెచ్ఎంసీ ఆఫీస్ పరిధిలో అత్యధికంగా 9.5 సెం.మీ. వర్షపాతం
– అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
– బంజారాహిల్స్‌లో కూలిన నాలా రిటైనింగ్ వాల్
Monsoon: రాజధానిలో కుండపోత వర్షం పడింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు భానుడు ప్రతాపం చూపించగా తర్వాత సీన్ మారిపోయింది. మూడు గంటల నుంచి పలుచోట్ల కుండపోతగా వర్షం కురిసింది. గంట పాటు భీకరంగా వాన పడింది. రోడ్లపై వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చాలా చోట్ల వరద నీరు రోడ్లపైకి వచ్చింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని చాలా చోట్ల వర్షం పడింది.
నగరంలో అత్యధికం అక్కడే!
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్ పేటలో 8.4 సెం.మీ., బంజారాహిల్స్ వేంకటేశ్వర కాలనీలో 8.3 సెం.మీ., బేగం బజార్‌లో 8.1 సెం.మీ., గోల్కొండలో 7.5 సెం.మీ., కృష్ణా నగర్‌లో 7.4 సెం.మీ., చార్మినార్‌లో 6.5 సెం.మీ., పాటిగడ్డ వద్ద 6.1 సెం.మీ., బేగంపేట్‌లో 5.8 సెం.మీ., మూసాపేట్‌లో 4.9 సెం.మీ., ఉప్పల్‌లో 4.6 సెం.మీ., అల్వాల్‌లో 4.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. యూసుఫ్‌గూడ,, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, బాలానగర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, మూసాపేట్, జూబ్లీహిల్స్‌లో వర్షం పడింది. అలాగే, సంగారెడ్డి పట్టణంలోనూ భారీగా వర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కలెక్టరేట్ ఎదుట నీరు నిలిచింది. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడిపోయాయి. బారికేడ్లు నేలకొరిగాయి.
సీఎం అలర్ట్
భారీ వర్షం పడుతున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్‌లో సచివాలయానికి వెళ్లారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read: పవర్ ప్లాంట్‌ల నిర్మాణంలో అవకతవకలపై కమిషన్ బహిరంగ ప్రకటన
కూలిన నాలా రిటైనింగ్ వాల్
వర్షానికి బంజారాహిల్స్ ఉదయ్ నగర్ కాలనీలో నాలా రిటైనింగ్ వాల్ కూలిపోయింది. దీంతో అధికారులతో కలిసి పరిశీలించారు కమిషనర్ రోనాల్డ్ రోస్. ప్రజలకు వరద వల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముందుగానే నైరుతి
నైరుతి రుతుపవనాలు ఈ సారి ఆలస్యంగా భారత్‌లోకి ప్రవేశిస్తాయని తొలుత చర్చ జరిగింది. కానీ, గతంలోలాగే సమయానికే కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఈ నెల 31వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్టు ఐఎండీ అంచనా వేసింది.