Ycp leaders
Politics

YCP: వైసీపీలో మునుపెన్నడూలేని చిత్ర విచిత్రాలు

ఇప్పుడిప్పుడే యాక్టివ్ మోడ్‌లోకి వస్తున్న నేతలు
దాగుడు మూతల నుంచి బయటికి కొడాలి, పేర్ని
బయటికి రావడానికి జంకుతున్న మరికొందరు
కేసులు ఉన్నోళ్లే బయటికొస్తుంటే భయమేలా?
భయపడితే మరింత భయపెడతారనే భావన
పదవులు అనుభవించి క్యాడర్‌ను పట్టించుకోరేం?
అస్సలు కనిపించని అనిల్, బైరెడ్డి, యువనేతలు
ఉత్తరాంధ్రలో కొందరే యాక్టివ్.. మిగిలిన వారేరీ?
గెలిచిన 10 మంది కూడా జగన్ వెంట లేరా?

స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్: 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో మునుపెన్నడూలేని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీలో అన్నీ చిత్ర విచిత్రాలే. ఎప్పుడు ఎవరు యాక్టివ్ అవుతారో? ఎవరు అజ్ఞాతంలోకి వెళ్తారో తెలియని పరిస్థితి. అధికారం పోయి ఇన్ని నెలలు గడుస్తున్నా కొన్ని కొన్ని జిల్లాల్లో కనీసం క్యాడర్‌ను పట్టించుకునే నాథుడే లేడు. దీంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎవరైతే ఇక పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా కనిపించరు అనుకున్నారో వారంతా ఒక్కొక్కరుగా బయటికొచ్చేశారు. అయితే వాళ్ల రాకతో ఇక ఇప్పటి వరకూ యాక్టివ్‌గా ఉన్న వాళ్లంతా కనిపించకుండా పోయారు. ఇంకొందరైతే అసలు రాజకీయాల్లో ఉన్నారో లేరో కూడా తెలియట్లేదు. ఇదీ ఫ్యాన్ పార్టీ సంగతి. వాస్తవానికి ఈ పరిస్థితి పార్టీ ఆవిర్భావం నుంచి 2024 వరకూ ఎన్నడూ లేదు. కానీ ఎప్పుడైతే 151 సీట్లు నుంచి 11 స్థానాలకు పార్టీ పడిపోయిందో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. దీనంతటికి ఒకే ఒక్క కారణం నేతల్లో నెలకొన్న అరెస్టు, కేసుల భయమే.

దాగుడు మూతలొద్దని..
వైసీపీ అధికారంలో ఉండగా ఎవరెవరైతే విర్రవీగారో వారంతా నిన్న మొన్నటి వరకూ ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా బయటికొచ్చేశారు. ఇందులో మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. వీరితో పాటు కొన్నిరోజులుగా సైలెంట్‌గా ఉన్న పేర్ని నాని, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్ కూడా తెరపైకి వచ్చారు. వీరందరిపైనా ఒకటి కాదు రెండు కాదు చాలానే కేసులు ఉన్నాయి. వంశీ అరెస్ట్ తర్వాత తమ వంతు కూడా వస్తుందనీ వారికి తెలుసు. దీంతో ఏదైతే అదవుతుందని భావించిన నేతలు ఇంకెన్నాళ్ళు ఇలా దాక్కుంటాం? దాగుడు మూతలే సమస్యకు పరిష్కారమా? పోనీ అరెస్ట్ చేస్తే బయటికి రాలేమా? లాయర్లు ఉన్నారు కదా? అని వాళ్లకు వాళ్లే ప్రశ్నించుకున్నారట. అందుకే ఇలా భయపడి బతికే బదులు బయటికొచ్చి జనాల్లో తిరగడమే బెటరని భావించి కొడాలి లాంటి వాళ్లు వచ్చేశారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు జైలుకెళ్తే కాస్తో కూస్తో సానుభూతి కూడా వస్తుందని డిసైడ్ అయ్యారని తెలుస్తున్నది.

తగ్గేదేలే..!
మూడు కాదు ముప్పై కేసులు పెట్టుకున్నా సరే భయపడే ప్రసక్తే లేదని కొందరు, ధైర్యంగా రోడ్లపై తిరుగుతున్నా ఏం చేసుకుంటారో చేసుకోమని ఇంకొందరు కూటమి ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. నెక్స్ట్ అరెస్టులపై హింట్ ఇస్తున్న మంత్రులు, ముఖ్యనేతలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిపడేస్తున్నారు. దీనంతటికి కారణం అరెస్ట్‌ అవ్వాలని రాసిపెట్టుంటే ఎవరూ తప్పించలేం? భయపడుతూ ఇంట్లోనే కూర్చుంటే,  మరింత భయపెడతారా కదా? ఇలా భయపడుతూ రాజకీయాలు చేయలేం కదా? అని ఉమ్మడి విజయవాడ, గుంటూరు జిల్లాల మాజీ మంత్రులు, సీనియర్లు చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చారట. ఎలాగో పార్టీ అన్ని విధాలుగా అండగా ఉందని, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం యాక్టివ్ కావడంతో ‘తగ్గేదేలే’ అంటూ యమా యాక్టివ్ అయిపోయారు. విజయవాడ జైలుకొచ్చి వంశీని, గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతన్నలను జగన్ పరామర్శించడంతో నేతలు కొత్త జోష్‌తో ముందుకెళ్తున్నారు. అయినా సరే టీడీపీ నుంచి కొందరు మాత్రం తదుపరి అరెస్టులపై రోజుకొకసారైనా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.

అడ్రస్ కావలెను!
వైసీపీలో యాక్టివ్ అయ్యింది 10, 15 శాతం మంది అయితే ఇంకా బయటికి రావాల్సిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వీరంతా పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించిన, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న నేతలే అని సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే యువనేతలు ఒక్కరంటే ఒక్కరూ అటు రాయలసీమలో, ఇటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఎక్కడా కనిపించలేదు. ఇందులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బియ్యం మధుసూధన్ రెడ్డి, అబ్బయ్య చౌదరితో పాటు పలువురు సీనియర్లు సైతం ఉన్నారు. వీరంతా ఎక్కడున్నారో, ఏమయ్యారో కూడా క్యాడర్‌కే తెలియట్లేదు. తమ కష్టాలను పట్టించుకునే నాథుడే లేకుండా మహాప్రభో అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఇంకొందరైతే మా లీడర్ కనిపించట్లేదు? మా మాజీ ఎమ్మెల్యే లేదా మాజీ మంత్రి అడ్రస్ కావలెను? అంటూ పోస్టర్లు తయారు చేసి మరీ వైసీపీ కార్యకర్తలు హడావుడి చేస్తున్నారు. కనీసం ఇంత జరుగుతున్నా ఇసుమంత కూడా ఆయా నేతల్లో చలనం లేకపోవడం గమనార్హం.

రోజాకు మళ్లీ ఏమైంది?
వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీలో యాక్టివ్‌గా ఉన్న వారిలో మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా కూడా ఒకరు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య ఎందుకో చడీ చప్పుడు చేయకుండా సైలెంట్ అయ్యారు. నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ వైసీపీలోకి వస్తున్నారన్న వార్తలతో తొలుత డీలా పడినా, ఆ తర్వాత అధినేతతో నేరుగా తేల్చుకోవడంతో మొత్తం సెట్ అయ్యింది. దీంతో జగదీష్‌ను పార్టీలోకి తీసుకురావాలనుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజా చెక్ పెట్టినట్లు అయ్యింది. దీని ఫలితం రోజాకు ‘గాలి’ దెబ్బ తగలకుండా తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ గ్యాప్‌లో మళ్లీ ఏం జరిగిందో తెలియట్లేదు కానీ రోజా డీలా పడిపోయారు. సోషల్ మీడియాలోనూ అంతంత మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. తిరుపతి కిరణ్ రాయల్, మదనపల్లి యాసిడ్ ఘటనలపై రోజా కనీసం స్పందించలేదు. దీంతో రోజాకు మళ్లీ ఏమైంది? అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా మహిళా నేతలు చాలా మంది పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఈ పరిస్థితి రాయలసీమతో పాటు అన్ని ప్రాంతాల్లోనే ఉంది. మరోవైపు వైసీపీ తరఫున గెలిచిన (జగన్ కాకుండా) 10 మంది ఎమ్మెల్యేల్లో తాటిపర్తి చంద్రశేఖర్ తప్ప మిగిలిన వారెవ్వరూ ఎక్కడా కనిపించట్లేదు. అసలు వారంతా వైసీపీలో ఉన్నారా? లేదా? ఇంతకీ వారంతా జగన్ వెంట ఉన్నారా? లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?