– విద్యుత్ కొనుగోళ్లపై అనుమానాలొద్దు
– ఎక్కడా ప్రభుత్వానికి నష్టం జరగలేదు
– మాజీమంత్రి జగదీష్ రెడ్డి
Power Commission: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి నష్టమూ జరగలేదని, ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలంటూ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసింది. అయితే.. నేటి ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు మేం ఆనాడే అసెంబ్లీలో సమాధానమిచ్చాం. శ్వేత పత్రామూ విడుదల చేశాం’ అన్నారు.
‘విచారణ చేయాలంటూ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు ఒక బాధ్యత అప్పగించింది. ప్రభుత్వ సందేహాలకు కేసీఆర్ ఇప్పటికే జవాబిచ్చారు. కానీ, కమిషన్ తీరు మాత్రం వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా ఉంది. జవాబిచ్చేందుకు నెలాఖరు వరకు కేసీఆర్ గడువు కోరినా ఇవ్వలేదు. అందుకే ఈ కమిషన్ బాధ్యతల నుంచి ఛైర్మన్‌ను తప్పుకోవాలని కేసీఆర్ సూచించారు. అందుకు తగిన ఆధారాలనూ తన లేఖలో ఆయన చూపారు’ అని పేర్కొన్నారు.
‘జస్టిస్ నరసింహారెడ్డి మారిపోయారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌పై ఆయనకు సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ ఆయన తీరు అలా లేదు. ఒకవైపు విచారణ చేస్తూనే, తన అభిప్రాయాన్ని ముందుగానే మీడియాకు చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు కదా’ అని జగదీష్‌రెడ్డి చెప్పారు.