– కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా?
– రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయి
– ఒక్క అధికారి స్పందించినా రైతు బతికేవాడు
– పాలన సరిగ్గా లేదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి
– ప్రొద్దుటూరు ఘటనపై బీఆర్ఎస్ విమర్శలు
Khammam: రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్సే కారణమని, ఆ పార్టీకి ఓటేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నానని రైతు వీడియోలో చెప్పాడని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. తన భూమిలో జేసీబీ, ప్రొక్లెయిన్‌తో మట్టి తవ్విపోస్తున్నారని ఎస్ఐ, ఎమ్మార్వో, కలెక్టర్ వద్దకు వెళ్లినా స్పందన లభించలేదని రైతు చెప్పాడని, ఇందులో ఏ ఒక్కరు యాక్షన్ తీసుకున్నా ప్రభాకర్ బతికే వాడని చెప్పారు. ఇంత మందిలో ఏ ఒక్క అధికారీ స్పందించలేదంటే రాష్ట్రంలో పాలన సరిగ్గా లేదని అర్థమవుతున్నదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సెల్ఫీ వీడియోలో ప్రభాకర్ ఏడుస్తూ మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తే హృదయం ద్రవిస్తోందని, కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరం అని, ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ తండ్రి ఫిర్యాదు చేస్తే పోలీసులు నిరాకరించినట్టు తెలిసిందని, ఆ వీడియోనే మరణ వాంగ్మూలంగా స్వీకరించి కేసు ఫైల్ చేయాలని తెలిపారు. తనకు న్యాయం చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం పేర్లను ప్రభాకర్ రావు ప్రస్తావించారని గుర్తు చేశారు. తనకు చావే దిక్కు అని ప్రాణం తీసుకున్నాడని వివరించారు. ప్రభుత్వం తప్పు చేస్తే పోరాటం చేయడమే ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హరీశ్ రావు చెప్పారు. ప్రభాకర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని, తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయగలమని తెలిపారు. ఇదే ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఖమ్మం రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విడుదల చేసిన వీడియోను రీట్వీట్ చేస్తూ, రాష్ట్రంలో రైతుల కష్టాలు ఇలా ఉన్నాయి అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా? అని ప్రశ్నించారు.