– ఎన్నికల ముందు ఇష్టం వచ్చిన హామీలిచ్చారు
– ఇప్పుడు అమలు చేయకుండా మోసం చేస్తున్నారు
– 500 బోనస్ విషయంలో మాట మార్చారు
– మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు
– వానాకాలం వచ్చినా పెట్టుబడి సాయం ఏది?
– ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి హరీష్ రావు
Farm Oil: వానాకాలం వచ్చినా రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని కాంగ్రెస్ అందించడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వాన చినుకు పడితే రైతు బంధు పైసలు పడేవని తెలిపారు. ఎన్నికల ముందు హామీలు గుమ్మరించి ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నదని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్న రకాలకే ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని, రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని హరీష్ రావు వివరించారు. బోనస్ విషయంలో మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన బీఆర్ఎస్ గళమెత్తుతుందని స్పష్టం చేశారు.
నంగునూరు మండలంలో పర్యటించిన హరీశ్ రావు, ఆయిల్ పామ్ మొట్టమొదటి క్రాఫ్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదర్శ రైతు నాగేందర్ తనతో మొదటి మొక్క నాటించారని, ఇప్పుడు పంట కోత కూడా తన చేతుల మీదుగా చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. 2021 జూన్‌లో తొలిసారిగా నంగునూరు మండలం రామచంద్రపురం గ్రామంలో ఈ పంటను వేయడం జరిగిందని, అలా మూడేళ్ల క్రితం ఆయిల్ పామ్ సాగు ఇక్కడ ప్రారంభమైందని వివరించారు.
ఎల్లారెడ్డి పొలంలో మొదటి ఆయిల్ పామ్ మొక్క నాటితే, నాగేందర్ పొలంలో కోస్తున్నామని తెలిపారు. ఈ పంటను ఇక్కడ పరిచయం చేసిన ప్రజాప్రతినిధిగా తనకు సంతోషంగా ఉన్నదని చెప్పారు. పామాయిల్‌తో రైతులకు సుస్థిర ఆదాయం ఉంటుందని, ఎకరాకు 1.20 లక్షల ఆదాయం వరకు ఉంటుందని, ఖమ్మం, ఏపీల్లో రైతులు లాభాలు పొందుతున్నట్టే ఇక్కడ కూడా పొందాలని అనుకున్నామని హరీశ్ రావు తెలిపారు. ఈ పంటను సాగు చేస్తున్న రైతులకు అండగా ఉండాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నట్టు తెలిపారు.
పామాయిల్ దిగుబడిపై గతంలో 15 నుంచి 43 శాతం కస్టమ్ డ్యూటీ ఉండేదని, కానీ, ఇప్పుడు అది ఎత్తేశారని వివరించారు. తద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆయిల్ పామ్ దిగుమతి అవుతున్నదని, తత్ఫలితంగా ఇక్కడి రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఆయిల్ పామ్ రైతులకు లాభం జరగాలంటే దిగుమతులపై డ్యూటీ వేయాలని కోరారు. కొత్త రైతులకు డ్రిప్ రావడం లేదని, డ్రిప్ కంపెనీలకు డబ్బులు ఇవ్వకపోవడంతో అవి ముందుకు రావడం లేదన్నారు. మొక్కల సబ్సిడీ కూడా పెండింగ్‌లో ఉందని చెప్పారు.