సెకండ్ కేడర్ పై స్పెషల్ ఫోకస్
– ఎమ్మెల్యేలు మారినా మీరు పార్టీ వీడొద్దు
– కష్టకాలంలో వెంట ఉన్నవారికి సముచిత స్థానం
– స్థానిక ఎన్నికల వేళ జెడ్పీ చైర్మన్‌లపై దృష్టి
– కుటుంబ సభ్యులతో ఎర్రవెల్లికి ఆహ్వానం.. భేటీ
KCR: బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అధికార పార్టీవైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు గులాబీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారొద్దని పార్టీ అధినేత పలుమార్లు విజ్ఞప్తి చేశారు. మొన్న వరుసగా రెండు రోజులపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు పిలుచుకుని మరీ సమావేశాలు నిర్వహించారు. పార్టీ మారొద్దని బుజ్జగిస్తూ.. భవిష్యత్ బీఆర్ఎస్‌దేనని, పార్టీలో ఉన్నవారికి సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఆయన ముందు సరే అని చెబుతున్నా.. ఆ తర్వాత మళ్లీ పక్కచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ తన స్ట్రాటజీని మార్చారు. ఎమ్మెల్యేలు వెళ్లినా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండాలంటే సెకండ్ కేడర్‌ను కాపాడుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకే జెడ్పీ చైర్మన్‌లను కాపాడుకునే ఎత్తుగడ వేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నిర్ణయం మరింత ఉపకరించే అవకాశం ఉన్నది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫాంహౌజ్‌లో వరుస సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. శని, ఆది, సోమ వారాల్లో రెస్ట్‌లో ఉన్నారు. ఆ తర్వాత మంగళవారం 20 మంది జెడ్పీ చైర్మన్‌లతో భేటీ అయ్యారు. జెడ్పీ చైర్మన్‌లతో కుటుంబ సమేతంగా లంచ్ మీటింగ్‌కు ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు కేసీఆర్ ఆహ్వానించారు. వీరితో నిర్వహించిన సమావేశంలో పార్టీ మారొద్దని కేసీఆర్ బుజ్జగించినట్టు తెలిసింది. భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని, మళ్లీ గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నిలిచిన నాయకులను మరిచిపోబోమని, భవిష్యత్‌లో వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. జెడ్పీ చైర్మన్లు పార్టీ మారొద్దని సూచించినట్టు తెలిసింది. సెకండ్ కేడర్‌ను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ తాజాగా జెడ్పీ చైర్మన్‌లతో జరిపిన సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా సెకండ్ కేడర్ ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నారు. జగిత్యాలలో ఇటీవల మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినా.. సెకండ్ కేడర్, కార్యకర్తలు పార్టీపై అచంచల విశ్వాసంతో ఉన్నారని, తమ పార్టీ బలం కూడా వాళ్లేనని పేర్కొన్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలను కట్టడి చేయలేమని ఓ ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత గులాబీ పార్టీ సెకండ్ కేడర్‌ను కాపాడుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. సెకండ్ కేడర్ బలంగా ఉంటే వచ్చే ఏ ఎన్నికల్లోనైనా ప్రత్యర్థి పార్టీలను ఢీకొట్టే సామర్థ్యం ఉంటుందని భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.