– రూ. 200 కోట్ల కొనుగోళ్లలో రూ. 2 వేల కోట్ల అవినీతా?
– కిషన్ రెడ్డి పదవి కోసమే ఏలేటి ఆరోపణలు
– మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకున్నది మేమే..
– అవాకులు చెవాకులు పేలితే.. చర్యలు
– సివిల్ సప్లై శాఖను దివాలా తీయించింది బీఆర్ఎస్ సర్కారే..
– గాంధీ భవన్ మీడియా మీట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Minister Uttham Kumar Reddy: తెలంగాణలో యూ టాక్స్ పేరుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి చేసిన ఆరోపణలపై ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన నిరాధారణ ఆరోపణలపై మండిపడ్డారు. ఇప్పటి వరకు తెలంగాణలో రూ.200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు మాత్రమే జరగగా, ఈ కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించటం విచిత్రంగా ఉందన్నారు. తాను వెయ్యి కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారనీ, కానీ నేను ఎవరి దగ్గరా నయా పైసా తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి నీచపు మాటలు మానుకోవాలని మండి పడ్డారు.
తాను మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం సంగతిని పక్కనబెడితే, కనీసం వారిని కలవటం కూడా జరగలేదన్నారు. మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం తమదేనని, మిల్లర్లలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకున్నదీ తామేనని స్పష్టం చేశారు. డిఫాల్టర్ రైస్ మిల్లర్ల కోసమే బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. టెండర్ నిబంధనలకు లోబడి ఎంత ధాన్యమైనా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టత ఇచ్చారు. సన్న ధాన్యానికి గత ప్రభుత్వంలో రూ. 1700 మద్దతు ధర మాత్రమే దక్కగా, తాము అధికారంలోకి వచ్చాక అది రూ. 2400కి పెరిగిందన్నారు.
ఏలేటీ.. జాగ్రత్త..
బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపారనే వార్తలు వస్తున్నాయని, నిజానికి ఢిల్లీకి డబ్బులు పంపించే సంస్కృతి బీజేపీదేనని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
వినతిపత్రం పేరుతో సీఎం దగ్గరికి పోయి.. లోపలికి వెళ్లాక ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయాలు మాట్లాడటం ఏలేటికే చెల్లిందని కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఓవర్ టేక్ చేసేందుకే మహేశ్వర రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తద్వారా పార్టీలో ఎదగాలనేదే ఆయన వ్యూహమన్నారు.
బీఆర్ఎస్ నిర్వాకం..
గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ తరపున రూ. 58వేల కోట్లు అప్పులు చేసిందనీ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ పేరుతో మరో 11వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుందని బయటపెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, గత 6 నెలలుగా తాము ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తోందని, కొనుగోళ్లలో ఎక్కడా రైతుకు నష్టం కలగకుండా చూస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసిన ఘనత తమదని చెప్పుకొచ్చారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డినని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే అస్సలు ఊరుకోనని, ఇవన్నీ ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికేనని విపక్షాలను హెచ్చరించారు.