Danam Nagender: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) అనర్హత పిటిషన్ పై ఈ నెల 30న విచారణ జరగనుంది. విచారణకు హాజరుకావాలని నాగేందర్ కు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, న్యాయవాదులకు నోటీసులు ఇచ్చారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైనా అదే రోజు విచారణ జరగనుంది. పిటిషనర్ల తరపున సాక్ష్యాలు స్పీకర్ నమోదు చేయనున్నారు. అయితే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్నానని పార్టీ మారలేదని స్పీకర్ కు లేఖ ఇచ్చారు.
అనర్హత పిటిషన్ కొట్టేయాలి
పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని స్పీకర్‌కు ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదన్నారు. బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నాకు సమాచారం లేదన్నారు. నేను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని, ఆ సమయానికి వ్యక్తిగత హోదాలో వెళ్లానన్నారు. మీడియా కథనాల ఆధారంగా నేను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. ఆపార్టీ అనర్హత పటిషన్ లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నానని, గతంలో కోర్టు తీర్పులను అనుసరించి ఆ అనర్హత పటిషన్ చెల్లుబాటు కాదన్నారు. అనర్హత పిటిషన్ తర్వాత పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించొద్దని స్పీకర్ ను కోరారు.

