హైకమాండ్ ఆదేశంతోనా..?
బీసీ లీడర్ల సొంత నిర్ణయమా?
బీసీ సీఎం అంటూ మహేశ్ గౌడ్ కామెంట్
కాంగ్రెస్ పార్టీలో బిగ్ డిస్కషన్
బీసీ నేతలంతా ఏకమయ్యేందుకు ప్లాన్
కాంగ్రెస్‌లో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
Pcc Chief : తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చంశనీయంగా మారాయి. రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రిని చూస్తారంటూ ఆయన చేసిన కామెంట్లు పార్టీ నేతలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. పైగా ఇది కాంగ్రెస్‌తోనే సాధ్యమని, కానీ ఈ టర్మంతా రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతారని ఆయన క్లారిటీ ఇవ్వడం, బీసీ సీఎం ప్రకటనకు మరింత బలాన్ని చేకూర్చాయి. అంటే నెక్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ సీఎం ఉంటారనే విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పినట్లు అర్థమవుతున్నది. ఈ వ్యాఖ్యలు పార్టీలోని లీడర్ల నుంచి కేడర్ వరకు బిగ్ డిస్కషన్‌గా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే, బీసీ అభ్యర్థిని ఎంపిక చేస్తారా? క్యాండిడేట్ రేసులో ఎవరెవరు ఉండొచ్చు? ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ ఉన్నందున ఆయనే సీఎం రేసులో ఉంటారా? అనే చర్చ కూడా నేతల్లో విస్తృతంగా జరగడం గమనార్హం. ఇదే ఉద్దేశ్యంతో పీసీసీ ఈ వ్యాఖ్యలు చేశారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు అధిష్ఠానం ఏ బాధ్యతిచ్చినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తాను పాటించాల్సిందేనని పీసీసీ చీఫ్ కూడా కంటిన్యూగా చెప్తూ వస్తున్నారు. దీంతో తెరమీదకి వచ్చిన బీసీ సీఎం స్టేట్‌మెంట్ పార్టీలో ఆసక్తికరంగా మారింది. సడన్‌గా ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? హైకమాండే ఆయనతో చెప్పించిందా? అనే టాక్ కూడా నడుస్తున్నది. పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో పార్టీలోని కొంత మంది రెడ్డి సామాజిక వర్గ నేతలు, మంత్రులు కూడా షాక్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. నెక్ట్స్ టర్మ్‌లో సీఎం కుర్చీ కోసం ప్రయత్నించాలని భావిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రుల ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. అయితే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పట్నుంచే పార్టీలో ఉత్కంఠగా మారింది.
రేవంత్ అంగీకరిస్తారా? బీసీ నేతలంతా ఏకమవుతారా..?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు పక్కాగా ఉంటుందని, తానే సీఎంగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి పలుమార్లు మీడియా సాక్షిగానే చెప్పారు. కానీ ఇప్పుడు పీసీసీ చీఫ్చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, రాబోయే టర్మ్‌లో బీసీ సామాజికవర్గానికి సీఎం కుర్చీ ఇచ్చే చాన్స్ ఉందనేది స్పష్టమవుతున్నది. ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా? లేక తిరస్కరిస్తారా? అనేది కూడా చర్చంశనీయంగా మారింది. అయితే నేరుగా పీసీసీ చీఫ్ఈ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్‌లోని బీసీ నేతలంతా మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత నేతల నుంచి కొత్త వరకు పార్టీలో కీ రోల్ పోషించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక బీసీ నాయకులంతా ఓ టీమ్‌గా ఏర్పడాలని ప్లాన్ కూడా చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. క్యాండిడేట్ ఎవరైనా.. బీసీ నేతలకు అవకాశం లభించేలా కసరత్తు చేయాలని, పరస్పర సహకారంతో బీసీ నేతలు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే, రాబోయే టర్మ్‌లో ప్రస్తుతం సీఎం ఎలాంటి స్టెప్ తీసుకుంటారనే డిస్కషన్ కూడా ఇప్పట్నుంచే జరగడం గమనార్హం. మరోవైపు పార్టీ కార్యకర్తలు గట్టిగా కష్టపడితే ఇరవై ఏళ్ల వరకు పార్టీ పవర్‌లో ఉంటుందని, ఇటీవల సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి కూడా వేర్వేరు సందర్భాలలో వ్యాఖ్యానించారు. ఇలా కాంగ్రెస్‌లో కీలకంగా మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్‌లో ఎవరు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారోనని గ్రౌండ్ క్యాడర్ టెన్షన్ పడుతున్నారు. ఇక ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్సీ ఒకరు ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను తప్పుబడుతూ వస్తున్నారు. బీసీలకు న్యాయం చేయడం లేదని వాదిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో పీసీసీ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
దేశానికి అస్త్రంగా వాడతారా..?
బీసీలకు పెద్దపీట వేసేందుకే కులగణన చేస్తున్నామని గతంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించినా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని ఓ సీనియర్ నేత చెప్పడం విశేషం. అయితే తెలంగాణ బీసీ సీఎంను ప్రకటించి.. దేశ వ్యాప్తంగా బీసీలకు కాంగ్రెస్ అనుకూలం అనే సంకేతాన్ని కూడా బలంగా తీసుకువెళ్లాలనే లక్ష్యంతోనూ ఏఐసీసీ ఉన్నట్లు తెలిసింది. పైగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ సందర్భంగా పీసీసీ చీఫ్బీసీ సీఎం అనే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఒక్క రోజు గ్యాప్‌లోనే కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ను ప్రకటించారు. వీటన్నింటినీ పరిశీలిస్తే, బీసీ నినాదాన్ని ఏఐసీసీ బలంగా ఎత్తుకోవాలని భావిస్తున్నట్లు అర్థం అవుతున్నది. బీసీలకే రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ పలుమార్లు చెప్పిన సందర్భంగా, ఈ పరిస్థితులన్నీ అందుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.