– రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పణ
– 100కి పైగా సూచనలతో నివేదిక సిద్ధం
– ఎమ్మార్వో, ఆర్డివోలకు అధికారాల బదిలీ
– సర్వేయర్ల నియామకం అత్యవసరం
– పూర్తి స్థాయిలో భూసర్వే చేయాల్సిందే
– నెల రోజుల్లో పరిష్కారం చూపేలా రూల్స్
Land Survey: ధరణి పేరుతో.. గత ప్రభుత్వ హయాంలో సాగిన భూవివాదాలకు చెక్ పెట్టేందుకు గానూ కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనం తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసింది. దీనిని ఒకటి రెండు రోజుల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించనుంది. పలు శాఖల సమన్వయంతో రూపొందించిన ఈ నివేదక సుమారు 100కి పైగా సూచనలను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గత పాలనలో ఎమ్మార్వో, ఆర్డీవోల అధికారాల్లో కోతపెట్టారని, వాటిని తిరిగి పునరుద్ధరించాలని, భూ సమస్యలకు నెలరోజుల్లో పరిష్కారం చూపేలా నిబంధనలు రూపొందించాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.
పాత పద్ధతే మంచిది..
ధరణి రాకముందు.. ఏదైనా భూసమస్యలు వస్తే.. ప్రజలు తహశీల్దార్‌ను ఆశ్రయించారు. అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే.. ఆర్డీవో, అక్కడా సమస్య పరిష్కారం కాకుంటే.. అదనపు కలెక్టర్ స్థాయిలో అప్పీల్ చేసుకునే వీలుండేది. అలాగే, భూ సమస్యల పరిష్కారం విషయంలో జాయింట్ కలెక్టర్‌కి సర్వ హక్కులు ఉండేవి. నూటికి 90 శాతం సమస్యలు జాయింట్ కలెక్టర్ పరిధిలోనే పరిష్కారమయ్యేవి. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం జాయింట్ కలెక్టర్ వ్యవస్థను రద్దు చేసి.. దాని స్థానంలో అదనపు కలెక్టర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. దీనిని తీసేసి తిరిగి పాత పద్ధతికే వెళ్లటం మంచిదని నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ప్రధాన సమస్యలు
గ్రామాల్లోని సాధారణ భూవివాదాలు, భూముల హద్దుల మీద స్పష్టం లేకపోవటం, 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగులోనే ఉండటం, నిషేధిత జాబితాలో లక్షలాది ఎకరాల పట్టా భూమి ఉండటం, 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల సమస్య, 10 లక్షల కౌలు రైతులకు గుర్తింపు లేకపోవటం, ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల అంశాలను నివేదిక ప్రస్తావించారని తెలుస్తోంది. అలాగే, గత 80 ఏళ్ల నుంచి భూసమగ్ర సర్వే జరగలేదని కనుక సర్వేయర్ల భర్తీ అత్యవసరంగా చేపట్టాలని, భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో వివాదాలు ఉన్నాయంటూ పార్టు-బి కింద 18 లక్షల ఎకరాలను చేర్చారు. దీంతో అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాటికీ పరిష్కారం చూపాలని నివేదికలో సూచించినట్లు తెలుస్తోంది.