delimation
Politics

Delimitation Debate: సౌత్‌‌పై డీలిమిటేషన్ కత్తి! జనాభా ప్రాతిపదికతో లోక్‌సభ సీట్లకు ఎసరు

ఐదు రాష్ట్రాల్లో పాతిక స్థానాలు తగ్గే అవకాశం
తెలంగాణలో 3 లేదా 4 సీట్లు కోల్పోయే చాన్స్
ఉత్తరాది రాష్ట్రాల్లో పెరగనున్న 40 ఎంపీ సీట్లు
దక్షిణాది రాష్ట్రాలను లీడ్ చేస్తానన్న సీఎం రేవంత్
మార్చి 5న తమిళనాడు సీఎం అఖిలపక్ష భేటీ
కేంద్రం విధానాన్ని తప్పుపడుతున్న బీఆర్ఎస్
ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేసినందుకు శిక్షా?
ఐదారు రాష్ట్రాల్లో గెలుపుతో కేంద్రంలో పవర్‌లోకి..
వివిధ పార్టీల నేతలు, సీఎంల నుంచి వ్యతిరేకత

Delimitation Debate: లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెరమీదకు రావడంతో దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి మొదలైంది. కొత్తగా పెరిగే ఎంపీ స్థానాల సంగతేమోగానీ ఉన్నవాటికే కోత పడుతుందనే భయం పట్టుకున్నది. ‘ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తెచ్చిన కుటుంబ నియంత్రణ విధానాన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసినందుకు ఇదేనా శిక్ష?’ అంటూ దక్షిణాది రాష్ట్రాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా, 2026లో చేపట్టే జనగణనతో వచ్చే గణాంకాలను ప్రామాణికంగా తీసుకున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఇబ్బందేనని ముఖ్యమంత్రులు వాపోతున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం 120 ఎంపీ సీట్లు ఉంటే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దాదాపు 25 స్థానాలు తగ్గిపోతాయన్న ఆందోళన మొదలైంది. డీలిమిటేషన్‌పై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా ప్రమాదాన్ని నివారించేందుకు దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఆందోళన

ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాలసీ పటిష్ఠంగా అమలు కాకపోవడంతో జనాభా గణనీయంగా పెరిగిందని, దీంతో దాదాపు 40 సీట్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 14 లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశాలున్నాయి. రాజస్థాన్, హర్యానా, బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మరో 25 పెరుగుతాయని అంచనా. యూపీ, హర్యానా, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని.. దక్షిణాది రాష్ట్రాల అవసరమే ఉండకపోవచ్చని కేరళలో ఈ నెల రెండోవారంలో నిర్వహించిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యనించారు. ఐదు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతలు డీలిమిటేషన్‌తో లోక్‌సభ స్థానాలు తగ్గుతాయనే ఆందోళనలో ఉన్నారు.

సమాఖ్య స్ఫూర్తికి విఘాతం
దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు డివొల్యూషన్ (కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా) రూపంలో ఆర్థికంగా కేంద్రం నుంచి వివక్షను ఎదుర్కొంటున్నాయని రేవంత్ పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియతో అది మరింత తీవ్రమవుతుందని, ఈ రాష్ట్రాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు అవసరమైతే తానే లీడ్ రోల్ తీసుకుంటానని వ్యాఖ్యానించారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం జనాభా లెక్కలను డీలిమిటేషన్‌కు కొలమానంగా తీసుకుంటున్నదని, కుటుంబ నియంత్రణను అమలు చేసిన దక్షణాది రాష్ట్రాలను శిక్షిస్తూ అది పాటించని ఉత్తరాది రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నదని హైదరాబాద్‌లో గతేడాది అక్టోబరులో ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో వ్యాఖ్యానించారు. దేశంలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య విభజన రేఖ ఏర్పడుతుందని, రాష్ట్రాల సమాహారమే దేశమనే సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి నిధులు, ఉత్తరాది నుంచి ఓట్లు మాత్రమే మోదీకి కావాల్సిందని ఆరోపించారు.

అఖిలపక్ష సమావేశం ఎంతో కీలకం
డీలిమిటేషన్‌తో ఏర్పడే ప్రమాదాన్ని గ్రహించిన తమిళనాడు సీఎం స్టాలిన్ రాజకీయాలకు అతీతంగా మార్చి 5న సుమారు 45 గుర్తింపు పొందిన పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర హక్కుల కోసం అన్ని పార్టీలూ ఒక్క తాటిపై నిలబడాలన్న అంశాన్ని ఈ సమావేశం ద్వారా నొక్కిచెప్పనున్నారు. ఆర్థికవృద్ధి రేటులో, కేంద్ర పన్నుల వసూళ్లల్లో దక్షిణాది రాష్ట్రాలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయని, ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా జనాభాను కూడా నియంత్రించాయని గుర్తుచేశారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం గతంలో డీలిమిటేషన్‌కు జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటే జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి పిల్లల్ని ఎక్కువగా కనాలంటూ ఇటీవల పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున బీజేపీతో, ప్రధానితో కొట్లాడేకంటే పరోక్షంగా రాష్ట్ర జనాభా పెరగాల్సిన ఆవశ్యకతపై దృష్టి పెట్టారు. మొత్తం దేశజనాభాలో దక్షణాది రాష్ట్రాల వాటా తక్కువగా ఉన్నా జీడీపీలో మాత్రం ఉత్తరాదితో పోలిస్తే ఎక్కువగా ఉన్నదని పార్టీల నేతలు ఉదాహరణలతో సహా వివరించారు.

తెలంగాణలో తగ్గనున్న స్థానాలు
జనాభా లెక్కలను (2011 లేదా 2026) పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాల్లో మూడు లేదా నాలుగు తగ్గే అవకాశమున్నది. తమిళనాడులో 39 స్థానాల్లో 9, కేరళలోని 20 సీట్లలో 6, కర్ణాటకలోని 28లో 2, కేరళలోని 20లో 6, ఏపీలో 25లో 5 సీట్ల చొప్పున మొత్తం 24 లేదా 25 ఎంపీ స్థానాలు తగ్గే అవకాశమున్నది. ప్రస్తుతం ఈ ఐదు రాష్ట్రాల్లో 120 ఎంపీ సీట్లు ఉంటే అది 95 లేదా 96కు పరిమితం కావచ్చని అంచనా. తమిళనాడు సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశాన్ని చర్చిస్తుండడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం కోయంబత్తూరు పర్యటన సందర్భంగా… ఇప్పుడున్న ఎంపీ సీట్లకు కోతపడే అవకాశమే లేదని, లోక్‌సభ వేదికగానే ప్రధాని మోదీ గతంలోనే క్లారిటీ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం మూడేండ్ల క్రితం తమిళనాడు పర్యటన సందర్భంగా సీఎం స్టాలిన్‌తో డీలిమిటేషన్, సీట్లపై పడే ప్రభావం గురించి చర్చించారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు