– ఓటు వేయడంలో అవగాహనరాహిత్యం
– ప్రాధాన్యత ఓట్లను వేయకుండా పిచ్చి రాతలు
– ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా చెల్లని ఓట్లు
– అభ్యర్థులకు ముచ్చెమటలు
Teenmar Mallanna: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్లను నిన్నటి నుంచి లెక్కిస్తున్నారు. బ్యాలెట్ ఓటింగ్, ప్రాధాన్యత ఓట్లు కావడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతున్నది. నిన్నటి నుంచి ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపులో మునిగిపోయారు. కానీ, బ్యాలెట్ పేపర్‌లను చూసిన అధికారులు ఖంగుతింటున్నారు. డిగ్రీ చదివిన ఓటర్లు కనీసం ఓటు కూడా సరిగా వేయకపోవడంతో నివ్వెరపోయారు. కొందరిది అతి అయితే.. మరికొందరిది అవగాహనరాహిత్యంగా బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థులకు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా అంకెలను వేయకుండా పిచ్చి రాతలు రాశారు. చిత్రి విచిత్ర వేషాలు వేశారు.
బ్యాలెట్ పేపర్‌పై జై మల్లన్న, జై రాకేశ్ రెడ్డి అంటూ కొందరు ‘పట్టభద్రులు’ రాశారు. మరికొందరు తమ అభ్యర్థిని ప్రశంసిస్తూ రాశారు. కానీ, వారికి తమ ప్రాధాన్యత అంకెనే వేయలేదు. ఇంకొందరు మహానుభావులు ‘ఐ లవ్ యూ’ అని రాసుకున్నారు. ఫోన్ పే నెంబర్ రాసిన మేధావులూ ఈ పట్టభద్రుల ఓటర్లలో ఉన్నారు. ఇక ఇవేమీ రాయకుండా.. రాయాల్సిన ప్రాధాన్యత అంకెలను నమోదు చేయకుండా ఖాళీ బ్యాలెట్ పేపర్లు వేసి పైశాచిక ఆనందాన్ని పొందారు మరికొందరు. ఇలా పట్టభద్రుల ఓట్ల లెక్కింపులో నోరెళ్లబెట్టే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు వీరు పట్టభద్రులేనా? పట్టభద్రులకు ఉన్న అవగాహన ఇదా? వారికి ఉన్న బాధ్యత ఇదేనా? మండలిలో తమ గొంతు వినిపించే ప్రతినిధిని ఎన్నుకోవడంలో ఇంత ఉదాసీనత, అవగాహనరాహిత్యం డిగ్రీపట్టాదారులకు తగునా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
పట్టభద్రుల ఈ అతి తెలివి తేటలతో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. అభ్యర్థుల తరఫున కౌంటింగ్ హాల్‌లో ఉన్న ఏజెంట్లకు బిత్తరపోయినంత పనైంది. చెల్లని ఓట్లుగా అధికారులు వీటిని పక్కనపెడుతుండటంతో వారికి ఏజెంట్లకు మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగినట్టూ తెలిసింది. దీనికి తోడు తొలి ప్రాధాన్యత ఓట్లతో గెలుపు ఖరారు అయ్యేలా లేదు. ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యంగా మారినట్టు సమాచారం.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో అధికారులు రిజల్ట్ సరిచూసుకుంటున్నారు. తుది ఫలితంపై అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగింది. చెల్లని ఎట్ల బెడదతో తలలు పట్టుకుంటున్నారు. నాలుగు రౌండ్‌లలో సుమారు 20 నుంచి 25 వేల చెల్లని ఓట్లు పడ్డాయి. ఇది అభ్యర్థుల మెజార్టీని గండికొట్టనుంది.
మూడో రౌండ్ ఫలితాలు
మూడు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆయనకు 1,06,234 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 87,356 ఓట్లు, మూడో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ 27,493 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. మూడు రౌండ్లు ముగిసే సరికి 2,64,216 వ్యాలిడ్ ఓట్లు ఉన్నాయి.