పార్టీ మారడంపై వివరణ కోరుతూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defected MLAs)కి మంగళవారం నోటీసులు జారీ చేశారు. అయితే తమకి వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలంటూ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో నోటీసులు జారీ చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నోటీసులిచ్చారు.
Also Read : ఊహకందని కవిత ఎత్తుగడ… డైలమాలో గులాబీ అధిష్ఠానం
ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠకి తెరలేపింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defected MLAs) భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండనుంది అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ఇంట్లో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. స్పీకర్ కార్యాలయం నోటిసులతో న్యాయపరంగా ముందుకెళ్లే అంశంపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చిన నోటీసుకు, సుప్రీంకోర్టుకు ఏ విధమైన సమాధానం ఇవ్వాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో సైతం ఉన్నట్టు తెలుస్తోంది.