– మేడిగడ్డ బ్యారేజ్‌లో కేంద్ర నిపుణుల బృందం పరీక్షలు
– బ్యారేజ్ పనితీరు, లోపాలపై అధ్యయనం
– నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, మట్టి నమునాల సేకరణ
– కుంగిన పిల్లర్ల వద్ద 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు
CSMR Team Inspects Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రభుత్వానికి భారమేననేది మేధావుల వాదన. ప్రజాధనాన్ని వృధా చేసి, దోచుకునేందుకే కేసీఆర్ దీన్ని నిర్మించారనే విమర్శలున్నాయి. పైగా, బ్యారేజీల్లో వరుసగా లోపాలు బయటపడడంతో ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర నిపుణుల బృందం మేడిగడ్డపై అధ్యయనం చేస్తోంది. బ్యారేజ్ పనికొస్తుందా లేదా? నిర్మాణం ఉంటుందా లేదా? ఇలా అనేక డౌట్స్‌తో సమావేశాలు, బ్యారేజ్ పరిశీలన చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం కొన్ని పరీక్షలు నిర్వహించింది.
మేడిగడ్డలో పరీక్షలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం పరీక్షలను ప్రారంభించింది. ఎన్డీఎస్ఎస్ సూచనల మేరకు ఏఏ పరీక్షలు చేయాలో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఢిల్లీకి చెందిన సీఎస్ఎంఆర్ఎస్, సీడబ్ల్యూపీఆర్సీ నిపుణులు అంబట్ పల్లిలోని మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు వెళ్లారు. బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, మట్టి నమునాలను సేకరించారు. బ్యారేజ్ కుంగిన పిల్లర్ల ప్రాంతంలో 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
కొనసాగుతున్న మరమ్మతు, గ్రౌటింగ్ పనులు
బ్యారేజ్ పనితీరు, లోపాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే నిధులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పిల్లర్లను నిపుణుల బృందం పరిశీలించింది. బ్యారేజ్ అప్ స్టీమ్, డౌన్ స్టీమ్ పరిస్థితిని వీక్షించారు. అలాగే, బ్యారేజ్ వద్ద జరుగుతున్న మరమ్మతు, గ్రౌటింగ్ పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పిల్లర్ల కుంగుబాటుకు గల కారణాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు పరీక్షల కోసం శాంపిల్స్‌ను సేకరించింది నిపుణుల బృందం.