– రిజర్వేషన్లు తీసేయాలనేదే బీజేపీ కుట్ర
– మేమొస్తే 50 శాతం అందిస్తాం
– పదేళ్లలో అదానీ, అంబానీలకు మోదీ ఎంతో దోచిపెట్టారు
– మేమొస్తే అంత సొమ్మును పేదలకు పంచుతాం
– పేదల అకౌంట్‌లో లక్ష రూపాయలు వేస్తాం
– ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.8,500 అందిస్తాం
– ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాం
– దేశమంతా కుల గణన చేయిస్తాం
– మెదక్, మల్కాజ్‌గిరిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
Reservations: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం మెదక్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరిగిన జన జాతర సభలకు హాజరయ్యారు. మోదీ సర్కార్‌ను గద్దె దించాల్సిన అవసరాన్ని వివరించారు. ముందుగా నర్సాపూర్ సభలో పాల్గొన్న రాహుల్, బీజేపీ అగ్ర నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా చెబుతున్నారని మండిపడ్డారు. మోదీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మనందరిపై ఉందని, ఓటు వేసే హక్కు ఆ రాజ్యాంగమే ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ సంస్థలన్నీ మోదీ ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు తీసేయడానికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.
‘‘రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ అనుకుంటోంది. మేము 50 శాతం రిజర్వేషన్లు ఇస్తాము. తెలంగాణలో కులగణన జరిగినట్టే దేశమంతా కూడా చేస్తాం. దేశంలో ఏ సామాజిక వర్గం వారు ఎంతమంది ఉన్నారో తెలియాలని, అప్పుడే నిజమైన రాజకీయ చైతన్యం ప్రారంభం అవుతుంది. మోదీ ఎయిర్ పోర్టులు, పెద్ద పెద్ద సంస్థలను అదానీకి అప్పగిస్తున్నారు. దేశ సంపద మొత్తం 20, 25 మంది చేతుల్లోనే ఉంది. ఆ సంపద కోట్ల మందికి రావాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచంలో ఎలాంటి ప్రభుత్వం ఇటువంటి పనులు చేయకపోవచ్చు. దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబ స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నాం’’ అని తెలిపారు రాహుల్ గాంధీ.
Also Read: వివేకా హత్య కేసులో భారతి రెడ్డి పాత్ర? బిగ్ టీవీతో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ
ఎంపిక చేసిన పేదలకు లక్ష రూపాయలు అకౌంట్‌లో వేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రతి మహిళ అకౌంట్‌లో ప్రతి నెలా రూ.8,500 తప్పకుండా వేస్తామన్నారు. ఒక్క దెబ్బతో దేశంలో పేదరికాన్ని నిర్మూలిస్తామని తెలిపారు. మోదీ కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, పెద్ద నోట్ల రద్దు అదానీ ప్రయోజనాల కోసమే చేశారని విమర్శించారు. ఇండియా కూటమి జూన్ 7న ఏర్పడబోతోందని, ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులను మోదీ అనేక రకాలుగా వేధించారన్నారు. తాము రాగానే రైతుల సమస్యలు తీరుస్తామని స్పష్టం చేశారు. ‘‘ధాన్యానికి మద్దతు ధర కచ్చితంగా ఇస్తాం. ఉపాధి హామీ కూలీని 400 రూపాయలకు పెంచుతాం. అదానీ, అంబానీలకు మోదీ ఎంత సొమ్ము ఇచ్చారో అంత సొమ్మును మేము పేదల అకౌంట్‌లో వేస్తాం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కోసమే పని చేస్తుంది. 30 వేల ఉద్యోగాలు, రూ.500 కే సిలిండర్, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. మీ కోసం ఢిల్లీలో సైనికుడిలా పని చేస్తా’’ అని చెప్పారు రాహుల్ గాంధీ.