బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవతరణ వేడుకల్లో పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ కే లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన తొలి దశ ఉద్యమంలో బీజేపీ క్రియాశీలక పాత్ర పోషించిందని, మలి దశ ఉద్యమంలోనూ నిలిచిందని అన్నారు. పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదం కోసం సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ గళం విప్పారని గుర్తు చేశారు. అప్పుడు లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సుష్మా స్వరాజ్ ప్రత్యేక తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, అందుకే తెలంగాణ ప్రజలు ఆమెను చిన్నమ్మ అని గుర్తుపెట్టుకుంటారని వివరించారు. అలాంటి సుష్మా స్వరాజ్‌ను తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో స్మరించుకోకపోవడం సరికాదని అన్నారు. బీజేపీని ఈ ఉత్సవాల్లో భాగం చేసుకోకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
తొలి దశ ఉద్యమంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 369 మంది ఉద్యమకారులను బలిగొందని, మలి దశ ఉద్యమంలో 12 వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడిందని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రి చరిత్రను వక్రీకరిస్తున్నారని, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్టు చెబుతున్నారని, సకల జనులు పోరాడితేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలి దేవత అని రేవంత్ రెడ్డి పిలిచారని, ఇప్పుడు ఆయనకు దేవత ఎలా అయిందని ప్రశ్నించారు. ప్రొఫెసర్ కోదండరాం ఈ విషయాలపై నోరు మెదకపోవడం దేనికి సంకేతం అని అడిగారు.
నాటి కేసీఆర్ ప్రభుత్వం కవులు, కళాకారులు, ఉద్యమకారులను విస్మరించిందని, నీళ్ల పేరు మీద కేసీఆర్ సర్కారు అందరినీ మోసం చేసిందని బీజేపీ ఎంపీ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ అమలు చేయకపోవడంతో కేసీఆర్‌ను ప్రజలు గద్దె దింపారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుకుప్పగా మార్చారని, కేసీఆర్ చేతికి చిప్ప ఇస్తే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ చిప్ప పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని సెటైర్లు వేశారు.
తెలంగాణ ప్రజలు మోదీ వైపే ఉన్నారని ఎగ్జిట్ పోల్స్‌తో తేలిపోతున్నదని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గ్రహించాలని ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. కవులు, కళాకారులు, ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే రేవంత్ రెడ్డికి ఈ ఐదేళ్లు కష్టంగానే సాగుతాయని వివరించారు. ఇక తెలంగాణ ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలుగా జరుపుకోవడం సమంజసం కాదని మండిపడ్డారు.